Monday, September 28, 2009

నిత్య విద్యార్థినై...

ఆకాశ గంగే తన పాదాలు తాకినా..
అహమంటూ వచ్చేనా ఈ నిత్య భిక్షువు కి..
ఆ నింగంత కరిగి తన మీద వాలినా..
అలుపంటూ రాదులే ఏ విఙ్ఞాన కుక్షువు కి..
కనుచూపు ఎటువైపూ సారించలేకున్నా..
చూడలేని సత్యముందా..ఆ అనుభవ చక్షువు కి..

Saturday, September 26, 2009

నా మది పలుకు...

ఎదో రాయాలి..
యెదలో బాధ దించేయాలి..
భవితకు మార్గం వేసెయ్యాలి..
కన్నీళ్ళను తేలిగ్గా మోసెయ్యాలి..

మంచివన్నీ దాచెయ్యాలి..
అవి కానివి వదిలెయ్యాలి..
సాధకునికి దీపం మనసవ్వాలి..
ఆ మనసే నిత్యం వెలుగులీనాలి..

కష్టాలన్నీ తుంచెయ్యాలి..
సంతోషాలు పంచెయ్యాలి..
సాధించిన విజయాలు దాటెయ్యాలి..
వాటిపై శషభిషలు మానెయ్యాలి..

చుక్కాని నావలా మదికి బతుకు తోడవ్వాలి..
కంటికి రెప్పలా ఆ దైవం కాపాడాలి..
సాగించిన ఈ పయనం ఓ రోజున ఆపెయ్యాలి..
సాధించిన ఘన విజయం ఆ రోజున నను నడిపించాలి...

నీ వారెవరు..?

నీ మది లోని శూన్యం పూడ్చేదెవరు..?
నీ ఆలోచనల భారం మోసేదెవరు..?
అగ్నిశిఖల నీ ఆవేశం భరించువారెవరు..?
అంతులేని నీ భావావేశం తెలుసుకునేవారెవరు..?

నింగినంటు నీ యత్నానికి ధైర్యమెవ్వరు..?
నేలరాలిన నీ గుండెకు ఆదరవు ఎవరు..?
నీ లోని సత్యాన్ని గుర్తించు మిత్రులెందరు..?
నీ స్వప్నాల సాకారాన్ని నమ్మెవారెందరు..?

నీవెప్పటికీ ఒంటరివే ఓ నా నేస్తం..!!
కాదని భ్రమింపజేసేను ఈ లోకం సమస్తం..!!

Thursday, September 24, 2009

నా ప్రేయసి కై ...

తొలిమంచు వేళే ఇల కు పులికింతలెందుకు...
పండు వెన్నెల్లో మది కి పరవశమెందుకు...
నీ నవ్వు తోనే నాలో ఈ మైమరపులెందుకు...
చెప్పగలవా నీవైనా...తెలుపలేరే ఏ కవులైనా...

నీ కోసం వేచాను పగలల్లా సూర్యుని కాంతినై...
నిన్నే కలవరించాను నిశి లోని ఆ శశి నేనై..
నింగి లోనే దాగాను నిన్నే చేరని చినుకునై..
నీ చెంత వాలాను ఇలా మాటల జడి వాననై..

నిదురించే పసిపాపడి సిరిమువ్వల రాగం...
చిగురించే ప్రతి పువ్వు లో కనిపించే భోగం...
ఉదయించే సమయాన కొవెల్లో దేవుని వైభోగం...
పరుగెత్తే కాలాలు నిలిచి చూచేటి సౌందర్యం...

ఓ రూపం లా ఇవి కొలువైతే...
దరి చేరమనే వాటి పిలుపైతే...
నీ యెదసడులే నా యెదుటన వినబడవా...
నా యెద లో నీ సందడులే మొదలవవా...

నువ్వుంటే...నా కలల రారాణి గా...
కొలువుంటా...నీ నవ్వుల పారాణిగా...
కాదంటూ నువ్వెళితే...నిష్కర్షగా...
కలకాలం ఆనందం...నన్ను వెలివేయదా...
ఏ సంతోషం ఇటుగా రాలేదు గా...

Sunday, August 23, 2009

Saturday, August 22, 2009

నాకు నచ్చిన నా వినాయకుని కోసం...

అఖండమండలాకృతిం...

అనన్య భక్తకా స్మృతిం...

విశిష్ట విజయ సాధకం...

సతత మదిం పూజితం...

సకలాభీష్ట ఫలప్రదం...

సనాతనం...సధర్మ కర్మ రూపకం..

నమోస్తు విఘ్నవినాయకం...

నృపాధిపం...శివాసుతం...

సదానంద సన్నిధౌ భజే...!!!

Friday, August 21, 2009

నాన్న కోసం...

ప్రపంచం పరిచయమయ్యే క్రమాన తనే నా తొలినేస్తం...
సంతోషం తో ఉప్పొంగిపోయేదా హృదయం...నా చిన్ని విజయానికి సైతం!!!

తొలి అడుగులు వేసేప్పుడు తన అడుగులే నాకాదర్శం....
నా ప్రతి అడుగు తీరం చేరాలన్నదే తన ఆరాటం!!!

ఆకలి నిండిన కడుపును నే చూడకూడదన్నది తన ఉద్దేశ్యం...
ఎరుగనైతి, నా ఆకలికై తను అనుభవించు కష్టాల సందేశం!!!

ఓటమెదురైన ప్రతి సారీ నన్నాదరించినదా హస్తం...
వెన్ను తట్టి ప్రోత్సహించి చేసిందీ, విజయపు దిశానిర్దేశం!!!

నే దారి తప్పినప్పుడే, తడి రుచి చూసే తొలిసారి ఆ నయనం....
మరువలేనూ, నా మార్గం మార్చేందుకు తన గమ్యం వదిలేసిన వైనం!!!

ఇరుకైన దోవల్లో నన్నెత్తుకుని కొనసాగించెను తన పయనం....
తడబడు ప్రతి అడుగుకూ బదులిచ్చు తన నైజం, నింపిందీ నాలో ఆత్మవిశ్వాసం!!!

తనకు కొడుకును చేసి, అడగకనే ఇచ్చెను ఆ దైవం నాకీవరం...
జన్మంతా అర్పించినా తీరేనా నన్నీ స్థాయికి చేర్చిన తండ్రి రుణం!!!

లోకం ఎరిగినంతలో తండ్రి హృదయం పాషాణం....
లోకులు ఎరుగరైతిరో ఎమో సమస్త నదుల జన్మ స్థానం!!!

పది మాసాలే మోయు కడుపున బిడ్డను ఏ తల్లైనా...
ఆ కొద్ది సేపే అనుభవించు తల్లి, ఎంతటి పురిటి కష్టమైన!!!
ఎదిగేంత వరకూ మోసేను తండ్రి తన భుజముల పైన...
భరించు ఎదురుదెబ్బలు తన గుండె మాటున, ఎదిగే ప్రతి సందర్భం లోనా!!!