Wednesday, February 1, 2017

ఉత్తరాయణం

సూర్యుడు మీనం నుంచి మేషం లోకి ప్రవేశించటానికి సిద్ధపడుతున్న కాలం. చలీ చీకటీ రెండూ గాఢాలింగనం చేసుకుని  హోరు గాలిని తమతో కలుపుకుని రాగాలు శృతి చేస్తున్న రోజులు.  కణ్వాన్తర కుటుంబాలకి ఇంకా చేరుకోని తొంభయ్యో దశకం.  ఆ ఇంట్లో అందరి లోనూ ఏదో ఉత్సుకత, తెలియని ఉద్వేగం. ధనుర్మాసం అంటేనే  సూర్యుడు మాత్రమే కాదు వృద్ధులూ ఉత్తరం వైపు ప్రయాణానికి సన్నద్ధమౌతుంటారని అంటూంటారు. అటువంటిదే అక్కడ చోటు చేసుకుంటోంది. ఆ ఇంటి పెద్ద తాత గారు బాగానే ఉన్నారు అప్పటి దాకా .. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు మంచాన పడుకున్న వాడు ఎగశ్వాస తీస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న పిల్ల మేక అందరూ ఆ గది లోనే ఉన్నారు... ఏమౌతుందో అని. అప్పుడే హడావిడి గా ఆ ఇంటి వైద్యుడు వచ్చిఆ పెద్దాయన పక్కన కూర్చుని, ఆయన తో మాట్లాడుతూ... నాడి చూసి ఆ పెద్దాయన చెవిలో ఏదో చెబుతూ, ఆయన తెచ్చుకున్న సంచి లో నుంచి ఒక సూది తో మందు ఇచ్చాడు. కాస్సేపాగి మళ్ళీ నాడి పట్టుకుని "ఇప్పటికి మరేం పర్వాలేదు", అనేసి వెళ్ళిపోయాడు ఆ ఇంటి పెద్ద కొడుకుని వెంటబెట్టుకుని.

" నారాయణ మరేం పర్వాలేదు ప్రస్తుతానికి.. కానీ పెద్దాయన కదా ఎప్పుడు ఏం వస్తుందో చెప్పలేం. అన్నిటికి సిద్దపడి ఉండండి. ఇంతకన్నా ఏమీ చెప్పలేను. హా...! ఆయన కి ఏమి కావాలంటే అది పెట్టండి, పథ్యం ఏమీ అక్కరలేదు. అయినా ఎంత సంతృప్తి గా ఉంటే అంత ఆనందంగా ఉంటాయి చివరి రోజులు". పెద్ద కొడుకు తో అన్నాడన్న మాటే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విన్నారు ఆ మాటలని.  ఆ మంచాన ఉన్న పెద్దాయన... ఆయన సగభాగం ఆ పెద్ద ముత్తైదువ తో సహా. అందరూ గుండె దిటవు చేసుకుంటున్నారు ఎవ్వరికైనా తప్పక వచ్చే స్థితి ఇది. కాలం తన ధర్మం తాను చేసుకుని వెళ్ళిపోతుంది కదా. ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా దానికి ఈ లెక్కలతో పని లేదు. తన పనికి అసలు ఇవి ఏవీ అడ్డు రావు. మౌనం గా ఈ సత్యాన్ని అందరూ అర్థం చేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు ఆ పెద్దాయన సంపూర్ణ దేహం తో సహా.


చీకటి చిక్కబడుతోంది అందరూ నిద్ర లో ఘీంకార స్వరాలు వల్లే వేస్తున్నారు. అంత మధ్య రాత్రి లోనూ నిద్ర పట్టక కన్నులు తెరవక తెలియని బాధ ని కంటికీ రెప్పకీ మధ్య దాచుకుని ఇబ్బంది పడుతోంది సుబ్బమ్మ గారు, ఆ ఇంటి పెద్ద తాతగారి ధర్మపత్ని. ఎన్ని భగవన్నామాలు చెప్పుకున్నా నిద్ర రాదే... ఎంత ప్రయత్నించినా బాధ మనసు దాటి పోదే.. ఇదంతా సహజం ఎప్పుడో ఒకప్పుడు తనకి కూడా తప్పదు..  ఇవన్నీ తెలుసు! ఎన్నో పురాణాలూ చదివింది, మరెన్నో విన్నది ఇంకా వేదాంత జ్ఞానం జన్మతః అబ్బింది. కానీ ఎక్కడ నుంచి వస్తోంది ఇంకా ఈ బాధ. అవును ఆ మంచాన ఉన్న మనిషి వల్ల వస్తోంది. ఆయనకి బాగా లేదు అని తెలిసినప్పటి నుంచీ వస్తోంది. అందరూ అన్న మాటలు గుర్తొస్తూంటే వస్తోంది...  ఆయన పెద్దవాడయ్యాడు కదా మనం ఆ సత్యాన్ని గుర్తించాలి అని అంటున్నారు... ఇంకెవరో అన్నారు ఆయనకీ ఎనభై దాటాయి అని... అవును ఎనభై దాటితే మనిషి చచ్చిపోవాలా? సరిగ్గా అప్పుడే రివ్వున మనసు ఒక్కసారి బుద్దిని తాకి కన్నీరుగా చెంప పైన వాలింది... ఆ పైన చీర కొంగు లో దాగింది. ఇప్పుడు మళ్ళీ కంట్లోకి వచ్చి చేరింది ఆ బాధ.  అప్పుడే జ్ఞప్తి కి వచ్చింది ఆవిడకు ఆయన వయసు! మరి తన వయసో ... ఎప్పుడూ ఆయన కన్నా ఏడేళ్లు చిన్న అని చెప్పటమే కానీ ఇంతా అని నిక్కచ్చి గా తనకీ తెలియదు. వాళ్ళ డెబ్భై ఏళ్ళ స్నేహం లో తనకి ఎపుడూ గుర్తుకు రాని ఆలోచన అది. ఎవరో వాదించుకుంటున్నారు కృష్ణాష్టమికి పుట్టాడు రా అని అంటే ... కాదు భద్రపదం లో పుట్టాడు రా అని... అధిక మాసాలు అన్ని కలుపుకుంటే తొంభయ్ దాటుతాయని మరికొందరు ఇలా చర్చించుకుంటూ, ఆ పెద్దాయనకి మందు ఇచ్చేశాక  ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. కానీ సుబ్బమ్మ గారి దారి మాత్రం అక్కడి తో ఆగిపోయింది.

ఆ పెద్దాయన చిన్నగా చలికి వణుకుతున్నారు... కాదు మెల్లగా స్పృహలోకి వచ్చారు. ఎదో కావాలి ఈ జీవుడికి అని అంటూ లేచి వెళ్తున్నారు సుబ్బమ్మ గారు. ఎవ్వరూ ఆ మాటలు వినే తెలివితో లేరు.


మెల్లగా వెళ్లి వైద్యుడు కూర్చునే బల్ల మీద ఆ మంచం పక్కన్నే కూర్చుని చూస్తోంది ఆ ముదుసలి కళ్ళ వైపు. కాస్త మంచి తీర్థం నోటికందిస్తూ. అటు ఆయనకీ తన పరిస్థితి తెలుస్తోంది. చలికి వణుకుతున్నాయేమో గట్టిగా  పట్టుకుంది... అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతూ కొంగు ముడితో కలిపి  తన చేయి పట్టుకున్నవాడి చేతిని. ధర్మేచా.. అర్థేచా... కామేచా... నాతిచరామి అని ఆపేసారు పెళ్లి లో... మరి మోక్షం లో? ఇక్కడ ఎవరి దారి వాళ్లదే ఇక్కడికి మాత్రం కొంగు ముడి రాదు. మరి ఇక్కడి దాకా ఇద్దరూ కలిసి ప్రయాణం చేసాక వాళ్ళు అద్వైతమైతే...!!! ఆ బాధే గుండెలను పిండేస్తోంది నేడు ఆ పెద్దలిద్దరినీ ఒక్కటిగ. ఆవిడ పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం రావట్లేదు ఇటు శబ్దం వినిపిస్తోందీ అర్థం కావట్లేదు. ఎప్పటిది  ఈ మైత్రి ? ఎన్నేళ్ల క్రితం పురుడు పోసుకుంది? బహుశా కొన్ని జన్మల క్రిందట కావచ్చు. కానీ ఈ జన్మ లో ఆవిడకు సరైన ఊహ వచ్చిన వయసు ఇంకా రాలేదు...  ఏడో  ఎనిమిదో ఉంటుంది. ఆయన కంటే సరిగ్గా ఏడేళ్లు చిన్నఅని మాత్రం తెలుసు. అప్పుడు మొదలయ్యింది వారి బంధం.

ఏడు దశాబ్దాలు గా ఆ బంధం అలాగే కొనసాగుతోంది. ఒకరి జీవితం అంటే ఇంకొకరు లేకుండా చెప్పటం కష్టమే! ఈ ఇంటి కోడలైన కొత్తలో ఆవిడకి ఏమీ తెలియదు ఆపైన తాళి కట్టిన వాడు తప్ప వేరే తెలియదు. "మావయ్యా నీ సుబ్బులుని నాకు ఇచ్చి చెయ్యరాదూ, బంగారం లా చూసుకుంటా" అని తన తండ్రి దగ్గర అన్న మాటలు ఆమెకు లీలగా ఇప్పటికీ గుర్తే. తానేమో పాలకుండ అడుగులా ఉంటానని ఇంట్లో అందరూ వెక్కిరించటమే... ఆయనేమో ఎర్రటి ఎరుపు. బాగా కుదిరిన జంటగా పెళ్లంటే ఒక ఆట లా జరిగిపోయింది ఆ వయసు లో. అటు పైన ఎన్ని గొడవలనీ... ఎన్ని పురుడులనీ...!!! ఆస్తులు హరించుకు పొయ్యాయి... కన్న బిడ్డలు దూరమయ్యారు కంటి ముందే..!!! పూలమ్మిన చోటే కట్టెలు కూడా... ! కొన్ని కాలనుకూలమైతే ఇంకొన్ని స్వయంకృతం. అన్నీ  కలిసే చేశారు... కలిసే పంచుకున్నారు... కలిసే కావడి మోశారు. ఈ పరమపదపు సోపాన వైకుంఠపాళీ లో చెరో పావులా కాకుండా.. ఒకరికి అర్థం మరొకరు గా ఇద్దరూ ఒక్కటిగా ఎన్నో నిచ్చెనలు ఎక్కుతూ పాములు పాలు పడుతూ ఏదిఏమైనా కలిసే  ఆనందంగా ఉంటూ...  ఎన్నో గడులు దాటి వచ్చేసారు. ఏ గడి లో ఉన్నారో కూడా ఎప్పుడూ చూసుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే ఆయన పంటకి వచ్చేసాడు మరి  తన మాటో ..?  ఈ సగాన్ని వదిలేసి తాను ఇంకెన్ని గడులు దాటాలో? ఎప్పటికి తానింక పండేనో?

తెల్లవారింది.. అంపశయ్య మీద భీష్ముడి లా ఉత్తరాయణం కోసం ఆ పెద్ద ప్రాణం కొట్టుకుంటోంది. రోజు రోజు కీ ఆరోగ్యం క్షీణీస్తోంది. అప్పుడే ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి అక్కడక్కడా. ఎవరో అంటే వినబడ్డాయి ఆ మాటలు!!! నాలుగు కుటుంబాలకి ఒకడే వారసుడు ఈయన, చాలా పెద్ద ఆస్తే వచ్చింది. కానీ అంతా హారతి కర్పూరం చేసేసాడు.  కాస్త  మిగిల్చినా కూడా కోట్లు విలువ ఇవ్వాళ. ఇంకా ఏవేవో మాటలు  అలాంటివే. ఇవి వింటున్నప్పుడు సుబ్బమ్మ గారి మనసులో ఆ జ్ఞాపకాలు మెదిలాయి. ఔను తానూ ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు నాలుగు కుటుంబాలకి కలిపి ఒకడే వారసుడు అవ్వటం చేత అందరి ఆస్తి ఈయనకే వచ్చింది. మరి అలాంటి ఆస్తి ఊరికే ఎలా హరించుకుపోతుంది? ఏవో జ్ఞాపకాలు దొంతరలను మనసు విప్పుతోంది.

ఒక రోజు చాలా సంతోషం గా వచ్చాడు ఆయన.  దగ్గరి చుట్టాల అమ్మాయి పెళ్లి సంబంధం కుదిర్చిన సంబరం అది. తనకీ సంతోషం గానే ఉంది కానీ ఏడాదిగా వర్షాలే లేవు ఎటు చూసినా కరువే. అలాంటి కరువు లో పెళ్లి ముహూర్తం ఏ ధైర్యం తో పెట్టించారు? పైగా అవతలి వాళ్ళు కట్నం కూడా ఇమ్మన్నారని విన్నది. మరి ఈ మనిషి ఎలా కుదిర్చాడు ఈ సంబంధం? " ఏవయ్యా ఎలా కుదిర్చావు సంబంధం చెప్పు ముందు అసలే కరువు కదా మరి పెళ్లంటే ఖర్చు భోజనాలు ఇన్నీ ఎలా చెయ్యగలవని ? ఏం  చేసి ఒప్పించావ్ నువ్వు?" అని మనసులో మాట అలాగే ఆయన ముందుంచింది.

"నిజమే ఇది కరువు కాలమే కానీ మనుషులం కరువు కాలేదు గా...!!! కష్టం కలిగినప్పుడే మనిషి ధైర్యాన్ని వెతుకుతాడు... అయిన వాళ్ళ కన్నా మనుషులకి ధైర్యం ఎవరుంటారు...? అందుకే పెళ్లి నేనే జరిపిస్తానని మాటిచ్చి వచ్చాను. ఒక జంట కి పెళ్లవుతుందంటే అది ఊరంతటికీ ఆనందం... ఒక ఆడ పిల్ల ఇల్లాలవుతుంది, ఆ వయసు మళ్ళిన తండ్రి బరువు దిగుతుంది. అన్నిటికి మించి తమ పూర్వికులు నుంచి వారసత్వంగా వచ్చిన విలువలు ఒక కొత్త తరం అందుకుంటుంది.  మరో కొత్త తరం పురుడు పోసుకుంటుంది. ఇంత విశేషమైన శుభకార్యం కరువు వల్ల ఆగిపోవాటానికి నా మనసొప్పుకోలేదే...ఇవన్నీ కాదు అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు అందుకే నీ మాట కూడా నేనే ఇచ్చేసాను. పెళ్లి భోజనాలకి మనకి కరువు లో ఆదుకుంటాయని గాదె లోనూ ఇంటి నేల అరలలోనూ దాచిన వరి కుప్పలున్నాయి గా అవి సరిపోతాయి...!!!  ఇక  కావాల్సిన సరుకులూ ఇంకా కట్నం...  " అనేసి అటు తిరిగి నిలబడ్డాడు ఆ పెద్ద మనిషి."... ఆ పెళ్లి జరగాలంటే ఇంకెంత భాగ్యం అమారాలో  " అనుకుంటూ.  "భాగ్యమంటే ఒంటి మీద నగలు దిగేసుకు తిరగటం కాదయ్యా ... ఏ ఆడపిల్లకైనా భాగ్యం సౌభాగ్యమే. ఇటు  చూడు నుదుటి పైన నువ్వు దిద్దిన రూపాయి కాసంత కుంకుమ... కంటి కిందే నీకిష్టమైన ముక్కుపుడక... నువ్వు కొనిపెట్టిన ఈ దుద్దులు... నువ్వు కట్టిన మాంగళ్యం. కళ్లెదుటే నువ్వు. ఈ జన్మ కి ఇంతకన్నాగొప్ప భాగ్యం ఏమని దాచుకోగలను ..." అని అంటూ తనకున్న బంగారం...నగలూ ఇస్తూ " ఆ పిల్లకి కావలసిన సౌభాగ్యం అమరనీయండి." అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది.

ఆ పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. ఆ పెళ్లనే కాదు ... నిజానికి అవసరం అని వచ్చిన ఏ మనిషీ కన్నీటి తో ఆ గడప దాటింది లేదు. ఆ ఇల్లే ఒక అన్నపూర్ణ .. అది ఆ ఇద్దరూ కలిసి చేసిన వితరణ యజ్ఞం. ఇప్పుడు చెప్పుకునే ఆస్తులే సమిధలు...  మంచి మనసు ఆజ్యం... సంతృప్తే హవిస్సు... ఆత్మానుభూతే ఆ యజ్ఞఫలం. కానీ ఇప్పుడు ఆ యజ్ఞఫలం పంచుకునే ఆ సగం ఏదీ? దాని గొప్పతనం ఎంత వివరిస్తే ఇప్పుడు వినిపిస్తున్న ఆ ప్రశ్నలకి  సమాధానం లభిస్తుంది? ఇప్పుడు అందరూ భాగ్యాలూ బంగారాలూ పోయాయి అని అంటున్నారు... అసలుకి ఇప్పటి దాకా ఆ భాగ్యం తనతోనే ఉంది.. ఇప్పుడిప్పుడే దూరమౌతున్నట్లు తెలుస్తోంది!!! తన బాధకి అసలు కారణం ఎక్కడో దొరికినట్లనిపించింది . ఎప్పుడూ ఎవ్వరికి సమాధానాలు సంజాయిషీలు ఇచ్చుకోలేదు తాను. ఆయన ఎప్పుడూ ఇది చెయ్యి అని చెప్పలేదు. ఆయన ఏది చేసినా తానూ భాగస్వామి అయ్యింది. తాను చేసేవాటిలో సగఫలం ఆయనకిచ్చేసేది. ఆయన మనసు గాయపడిన సందర్భాలన్నీ ఆవిడకు తెలుసు... తన కష్టం మాత్రం ఏనాడూ ఆ  పెదవి దాటింది లేదు. అటువంటి సప్త దశాబ్దాల స్నేహం ఈ రోజు వీడ్కోలు చెపుతుంటే గుండె పొరల్లోనుంచి ఏదో పెల్లుబికి వస్తోంది కానీ కంటి రెప్ప దగ్గర ఆవిరవుతోంది.

ఉత్తరాయణం రానే వచ్చింది పెద్ద వయసు వలన ఆ తాతగారు స్వదేహయానం చాలించారు. ఆయన  సగం దేహం మిగిలిన ప్రాణం తో కొట్టుకుంటోంది. అది ఘనీభవించిన కన్నీటి తాలూకు బాధ. ఈ సంసారం లో ఎన్నో కురుక్షేత్రాలను అవలీల గా ఎదుర్కొని గెలిచిన ఆ ఇల్లాలు శ్రీ కృష్ణ నిర్యాణానంతరం సవ్యసాచి లా మారిపోయింది. ఇంటి పెద్ద కోడల్ని పిలిచి " ఇక నేను  ఈ ఇంటి వ్యవహారాలు చూడలేను.. ఎలా చూడాలో తెలియట్లేదు అర్థం కావట్లేదు నాకు. వయసు మీరిపోయిందని అర్థమయ్యింది ఈ ఇంటి బాధ్యత మీరు ఎలా పంచుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఈ దేహం నడిచే వరకు నా ప్రాణానికి ఇంత ఆదరువు కలిపించండి చాలు." అంటూ అస్త్ర సన్యాసం చేసి తన లోకాన తానుండి పోయిందీ సుబ్బమ్మ గారు.






Sunday, August 10, 2014

ఎవరికీ వారౌ తీరుతో భావి తరం బేజారు...

చందమామని రమ్మనవూ ఈనాటి రాగాలూ... 
సూర్యుడిని పోమ్మనవూ సాయింత్రపు ద్వారాలు!!
తల్లి ఒడిని కాదందీ ప్రీ కేజీ పాఠశాల... 
భావి ధనరాశి కై పాతికేళ్ళ చెఱశాల .!! 
పారాడు వయసుపై ఈ నైరాశ్యపు భారాలు... 
పసివాడి చదువుల కై లక్షల్లో బేరాలు !!

కఠిక చీకటికి కలువరించే కన్నబిడ్డ కు ధైర్యమెవ్వరు?
కలలు కంటూ నిదరోయే పసిపాపని లోకమెవ్వరు?
తడబడు అడుగుకి విడివడని ఊతమెవ్వరు ?
ఓంకార పలుకుల సాకార ఒజ్జలెవ్వరు?

చిరుప్రాయపు రోగానికి వైద్యులెవ్వరు?
అమ్మ నాన్నల కన్న దైవాలు పిల్లలకింకెవ్వరు?

కోట్లను దాచే పోటీ లో నీ చిన్నారి కథలకి చోటేదీ?
సంపాదనకై పట్టే నిశి దివిటీ లో పిల్లలతో కలిసే మాటేదీ?
దూరపు చదువుల లోగిట్లో ప్రేమలు కొసరే బువ్వేది?
తప్పటడుగుల దారుల్లో ముప్పులు తెలిపే నీ గతమేది?

సాయంసంధ్యల వెలుగుల్లో ఇక నిన్నాదరించే తోడేదీ ?
అందమైన కుటుంబం అని చాటే బంధానికిక విలువేది?




Wednesday, November 13, 2013

---- కథ ---


                       నేను రాస్తున్నమొదటి బ్లాగు కథ ఇది!!! మొత్తం ఒకేసారి రయాలనుకున్నా దినచర్య లో నాకు మిగిలే సమయన్నే కేటాయించగలను కాబట్టి రోజు కి కొంచెం కథ చెప్తాను. నా మొదటి ప్రయత్నం పేరు విలువ . ఇక కథ లోకి వెళ్దాం. 
                                                        విలువ 
                         
                      క్షణ క్షణానికీ గాలి వేగం తీవ్రమౌతోంది...దానికి తోడు వర్షం నింగి నేలా అనే బేధం లేకుండా ఎకధార గా కురుస్తొంది.... ఎక్కడో సముద్రం కడుపున పుట్టిన తుఫాను ఇలా ఈ ఊరిని కమ్మేసిన మేఘానికి జల్లెడ పడుతోంటే, ఎప్పుడో నేను చేసిన పొరబాటు నన్ను నిలువనీయకుండా నా మనసుని ఆలోచనలజల్లెడ పడుతోంది. నాకు నేను మిగలకుండా ఎవ్వరికీ ఏమీ మిగల్చకుండా అంతా పోగొట్టుకుని  ఎందుకోసం ఈ బ్రతుకు? ఎం సాధించానని బ్రతకాలి నేను? నిన్నటిదాకా  నన్ను తమ పిల్లలకి ఆదర్శం గా చూపించిన నా చుట్టాలకి ఏ మొహం చూపించను? గర్వం గా అందరి ముందూ తల ఎత్తుకుని తిరిగిన రోజులని అసలు ఎలా గుర్తు తెచ్చుకోగలను? నన్ను నేను ఇక్కడితో ఆపేసుకోవాలి.... అందరికీ విజయానికి మరో పేరు అనిపించే లాగే నా కథ మిగిలిపోవాలి. నా సంపద... నా తెలివి తేటలు... నా  పేరూ అన్నీ ఇలాగే ఉండిపోవాలి.  అవన్నీ అలాగే ఉండాలంటే నేను ఇప్పుడు చచ్చిపోవాలి!!! 

      అదొక్కటే మార్గం గా తోస్తోంది నాకు...బయట వర్షం లో ఇంత తడుస్తున్నా నా లోపల రగులుతున్న జ్వాలలు ఆరటంలేదు. ఆరాటం ఇంకా ఎంత సేపు అని ప్రశ్నిస్తోంది నన్ను, చాలా అసహనం గా!!  ఇంట గెలిచిన చోట రచ్చకెక్కలేక ఇల్లు విడిచి, ఊరు విడిచి, ఇన్నాళ్ళూ కప్పుకున్న ముసుగు విడిచి దూరం గా వచ్చేసాను.  ఈ ఊరు దగ్గర గోదారి కనపడితే బస్సు దిగేసాను. వొడ్డున నిలబడ్డ నన్ను ఇప్పుడు గోదారి కుడా అడుగుతోంది తనలోకి ఎప్పుడు దిగుతానని.? ఎటు చూసినా ఏరు... కనుచూపు మేరంతా నీరు.. నా మనసంతా ఆలోచనలతో బేజారు!!! కూలబడ్డాను నేను.

      " ఏం కష్టం వచ్చింది దొరా!!!" ఎవరో నాతోనే గట్టిగా   అడిగారు ఈ మాటలు. నిజానికి ఆశ్చర్యపోయాను నేను. ఎవరో పరిచయం లేని వ్యక్తి నా ఎదురుగా నిలబడి తదేకం గా నన్ను చూస్తూ నిశ్చలంగా  చిన్న నవ్వు తో నన్నీ ప్రశ్న వేసేసరికి స్థాణువయ్యాను. నన్ను పైకి లేపటానికి తన చెయ్యందిస్తూ నా భుజం పైన చెయ్యి వేసి నన్ను పైకి లేపుతూ అడిగాడీ మాట. తల ఎత్తి పైకి చూసి " నాకు కష్టం వచ్చిందని ఎవరు చెప్పారు నీకు? నీకేం తెలుసు నా గురించసలు?" అని గద్దించాను!!! "కొప్పడకు సామి ఎదో బాధల్లో ఉన్నావని అడిగాలే అట్లా గసురుకోకు మారాజా....". నేను దుఃఖం లో ఉన్నానని ఇతనికెలా తెలుసు? నా మీద సానుభూతి చూపిస్తున్నాడా? అసలు భరించలేను నేను  సానుభూతిని. ఇలా ఎవరో పరిచయం లేని వ్యక్తి నన్ను బాధల్లో ఉన్నానని చెబుతూంటే  నా లోని అహం ఒప్పుకోవట్లేదు. నా కష్టం నేను ఇతరులకి చెప్పుకోలేను!!! " నేను కష్టం లో ఉన్నానని నీకెవరు చెప్పారు? నిన్ను ఏమైనా సాయం అడిగానా ? అసలు నువ్వెవరు అడగటానికి?" బిత్తరపోయాడతను నా ప్రశ్నల పరంపర కి. తమాయించుకుని అన్నాడు " ఒకరు చెప్పలా సామి మనిషి కష్టం లో ఉన్నాడు అని? ఇంత వర్షం లో, ఈ తుఫాను లో గోదారొడ్డున తడుస్తూ కూలబడ్డావంటే ఏదో చెప్పుకోలేని కష్టమే అయ్యుంటుంది మారాజా, అంతేనా? ఏ ఊరో కానీ మా వూళ్ళో గోదాట్లో ప్రాణాలు తీసుకుందామనుకున్నవ్ !!! నిజమే  కద సామి నేను చెప్పింది?".

ఈ సారి మరింత ఆశ్చర్యపోయాను, నా మనసుని ఒక పుస్తకం లా తన చెతుల్లోకి తీసుకుని పూర్తి గా చదివి నాకు అప్పచెప్తున్నట్టు ఉంది తను మాటాలాడుతుంటే.!! ఒక్క పెట్టున అతన్ని కావలించుకుని ఏడ్చేయాలనిపించింది...! కాని నా అహం మళ్ళీ అడ్డుపడి నన్నాపేసింది. ఈ సారి నేను ఒకే  ప్రశ్న వేసి అతని సమాధానం విని మారు మాట్లాడకుండా తన వెనకే నడిచాను. నేను అడిగిన ప్రశ్న" నేను అసలు కష్టం లో ఉండటం సరే, చచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్టు నీకెలా తెలిసింది? నీకెందుకిలా నాతొ మాట్లాడాలనిపించింది? నాతో నీకేం పరిచయం అసలు?"
దానికి అతనిచ్చిన సమాధానం " నేనూ మనిషినే సామి!!!". 
 
అతను అలా నా ముందు సాగిపోతూ ఉంటే నేను తనని అనుసరిస్తూ వెళ్లి ఒక పూరి పాక దగ్గర ఆగాను . లోపల నుండి ఒక ఆడ మనిషి వచ్చి నన్ను లోపలి తీసుకెళ్ళి నాకు ఒక తుండు గుడ్డ ఇచ్చి తల తుడుచుకోమని చెప్పి తానూ వంట గదిలోకి వెళ్లిపొయింది. నాతో వచ్చిన ఆ వ్యక్తి నా భుజం పైన ఉన్న గుడ్డ ని తీసి స్వతంత్రం గా నా తల పైన వేసి రుద్దేస్తున్నాడు.  నేను ఇక అసహనం భరించలేక పెద్దగా అరిచేశాను " స్టాప్ ది నాన్సెన్స్ !!!! హూ డి హెల్ అరె యు టు టేక్ కేర్ అబౌట్ మీ ? స్టాప్ థిస్ " ఒక్క సారి తల విదిలించేసుకుని అతని చెయ్యి పట్టుకుని గట్టిగా విదిలించి విసా విసా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఎందుకో ఇతరులు నన్ను అంత స్వతంత్రం గా దగ్గరికి తీసుకుని నాకేదో దు:ఖం వచ్చిందని నాపై సానుభూతి చూపిస్తూంటే భరించలేకపోయాను. 

అసలేం జరుగుతోంది నా జీవితం లో? అసలు పూరి పాక లో ఉండే వాళ్ళు కూడా నా పై సానుభూతి చూపించేంత దిగజారిపోయానా? ఎంత మందో కీర్తించిన నా తెలివితేటలు ఏమయ్యాయి? నాకు ఇక ఏ  లోటు లేదని చెప్పిన వాళ్ళేమయ్యారు? నా సంపద  అంతా ఏమయ్యింది? ఇన్ని ప్రశ్నలూ నన్ను నిలువనీయటం లేదు. తడుస్తూ ఆలోచిస్తూ ఎక్కడికెళ్తున్నానో తెలియదు కాని కన్నీటిధార కూడా కనపడనివ్వని వర్షాధార లో వెళ్ళిపోతున్నాను. 

చిన్నప్పట్నుంచి చాలా కష్టపడి చదివాను... ప్రతి దగ్గర విజయాన్ని అందుకోవటానికి నన్ను మరిచిపోయి కష్టపడ్డాను. ఎన్నో ఏళ్ళు నేను నా కాళ్ళ మీద నిలబడటానికి శ్రమించాను. నాకు స్నేహితులు చాల తక్కువ, నా చదువూ.. నా జీవితం..  నా ధ్యాస ఎప్పుడూ ఇలాగే ఉండేది. మా ఇంట్లో అమ్మా వాళ్ళు కూడా నన్ను ఎక్కువగా బంధువుల ఇళ్ళలో ఉండనిచ్చే వారు కాదు. నా తోటి వాళ్లతో ఆడుకోవటానికి కూడా రోజుకి ఒక అరగంట మాత్రమే వదిలే వాళ్ళు. నేను ఒక్కడినే కొడుకవటం తో నన్ను వృద్ధి లోకి తీసుకుని రావాలని వేరే వైపు నా దృష్టి మరలకుండా ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను కూడా ప్రతి క్లాసు లో ఫస్ట్ వస్తూ పెద్ద mnc కంపెనీ లో సెలెక్ట్ అయ్యాను. 

ఇంత తెలివి గల నేను ఇంత తప్పు ఎలా చేయగలిగాను? ఇప్పుడు నాతో పాటు నా కుటుంబమంతా రోడ్ మీదకి వచ్చింది!!! నన్ను నమ్ముకున్న వాళ్ళకి నా మొహం చూపించలేక పోతున్నాను. ఇంత సాధించి ఇంత సంపాదించి  నేను ఇప్పుడు చేసింది ఏమిటి? ఇంత దారుణమైన పరిస్థితి గురించి ముందే ఊహించని నా తెలివిని తిట్టుకోవాలా? లేకపోతే ఈ పరిస్థితి కి కారణమైన నా బలహీనత ని తిట్టుకొవాలా? ఎవరిని నిందించాలి? అంత గొప్పగా బ్రతికిన నేనూ నా కుటుంబం ఇప్పుడు ఏమి లేకుండా ఈ సమాజం లో ఎలా నిలబడాలి? ఎప్పుడూ విజయమే తప్ప ఏడుపు తెలియని నాకు, పెదవుల పై దాకా కారుతున్న నా కన్నీరు ఉప్పగా...  వర్షాన్ని కూడా కాదని తన రుచి చూపిస్తోంది! నాకు తెలియకుండానే...  పెద్ద శబ్దాలు లేకుండానే...  ఆకాశం కరిగి వర్షం లా ముంచెత్తుతోంది!! నా బాధా కూడా కన్నీరై కారుతోంది..  నిశబ్దం గా నా గుండె పగులుతోంది... ఆ చప్పుడు నాకు మాత్రమే తెలుస్తోంది...!! కాదు మరో ఇద్దరికీ కూడా !!! ఆ ఇద్దరు ఇందాక ఆ పూరి పాక లో ఉన్న వాళ్ళు.!! నన్ను వెంబడిస్తూ అరుస్తూ ఆ పై నెమ్మదిగా నా పక్కనే నడుస్తున్నారు నిశబ్దంగా. నా ఆప్తుల్లాగా నా అనుచరుల్లాగా నా మాట కోసం వాళ్ళు ఎదురుచూస్తూ నాతో  కలిసి అడుగులేస్తున్నారు.!!! నా కదలికలు అన్నీ గమనిస్తూ నన్ను వాళ్ళే నడిపిస్తున్నరేమో అనిపిస్తోంది!!! 

ఎవరు వీళ్ళు? వీళ్ళకి నాకు ఏంటి సంబంధం? ఎందుకిలా వెంబడిస్తున్నారు? నాకు ఇప్పుడు ఏదైనా సహాయం చేసి తర్వాత నా నుంచి డబ్బులు ఆశిస్తున్నారా? వాళ్ళ నిశబ్దం నన్ను భయానికి గురి చేస్తోంది. లేకుంటే నన్ను ఎక్కడైనా చంపేసి నాకు వచ్చే ఇన్సూరెన్సు నా భార్య పిల్లల్ని బెదిరించి తీసుకున్దామనుకుంటున్నారా?  నేను ఆగాను!!!

వాళ్ళతో ఇక నేను ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాను. ఆకాశం నుండి కురుస్తున్న వర్షం నన్ను తడిపేస్తుంటే నా పక్కన నిలబడ్డ వాళ్ళ చూపులు నన్ను తడిమేస్తున్నాయి . " ఏం కావాలి మీకు ?" గట్టిగా అరుద్దామనుకున్నాను కానీ, నా భుజం తట్టి నన్ను వాళ్ళ గమ్యం వైపు నడిపిస్తోంటే మౌనం గా నా అడుగులు నా స్వాధీనం తప్పి అటుకేసి సాగుతున్నాయ్ . నా లో నిస్సహాయమో లేక ఏదైనా సాయం ఇక్కడ దొరుకుతుందన్న ఆశో..  నా ఆలోచనలని కట్టడి చేసి నన్ను ఎటో నడిపిస్తున్నాయ్ . నా బుద్ది కన్నా..  నా మనసు దాని కన్నా..  ముందు, నా భవిష్యత్తు చాలా వేగం గా నాకళ్ళ  ముందే కదిలిపోతోంది .  చిన్నప్పట్నుంచి నేను గెలిచిన మెట్లు...  నేను దాటి వచ్చిన అడ్డంకులు...  నా ఎదుగుదలకు కారణమయిన దారులు...  మనుషులూ...  ఇంకా ఎన్నో నా కళ్ళ ముందు ఇప్పటికిప్పుడు తిరిగిపొతున్నాయ్ .

    నాకు నిజానికి వీళ్ళతో ఈ ఇంటికి రావటానికి భయమనిపించినా " ఏం కష్టమొచింది దొరా " అనే మాట... ఆ ప్రశ్న  ఎక్కడో నా మనసుని తాకి నా అడుగులు ఇటు పడేలా చేసింది . నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను అడగలేదు, నన్ను అందలం పైన కూర్చోబెట్టిన వాళ్ళూ అడగలేదు, నన్ను నేను కూడా ప్రశ్నించుకోనటువంటి మాట నన్ను అడిగేసరికి కంట నీరు పొంగింది, కానీ అహం దాన్ని ఆపేసింది. " ముందు తల తుడుచుకుని తలరా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకో బాబూ ఆరాక నీ బట్టలు వేసుకున్దూవు కాని... " అని అనేసరికి నేను ఈ లోకం లోకి మళ్లీ వచ్చాను . " ఏం  కష్టం లో ఉన్నాడో కొంచం వేడి వేడి గా పెట్టు, ఏ పూట తిన్నాడో ఎమో !!!... " నాకు ఆ మాటలు వినపడుతున్నాయ్ !!
     " ఎంత చదువుండి  ఏం ప్రయోజనం పెళ్ళాం బిడ్డల్ని పొషించటానికి ఇప్పుడు ఏం  మిగల్లేదు...  చేతులు కాలాకా మన దగ్గర చెయ్యి చాస్తే ఒక పూట మాత్రమే పెట్టగలం !!!" ఈ మాటలు కూడా కొన్ని గంటల క్రితం నాకు వినబడ్డాయ్ నా ఇంట్లో నే !. అవును నేను సంపాదిచింది అంతా పోగొట్టుకున్నాను నా పేరు తో సహా! నిజానికి నాకిప్పుడు ఎమీ మిగల్లేదు ఒక్క నేను తప్ప . ఒక పంచె కట్టుకుని పైపంచె వేసుకుని భోజనానికి కూర్చున్నాను కాని నాకు తినబుద్ది అవ్వట్లేదు .

   " అట్లా దిగులు గా కూర్చుంటే పరబ్రమ్మానికి కోపం వస్తుంది తెలుసా..?" అని అడుగుతోంటే ఆవిడ వైపు తల తిప్పాను అర్థం కాక ఆ మాటలు. " అన్నం ప్రబ్రమ్మం అంటారు కదా..  ఆయనగారికి కోపం వస్తుంది నువట్టా దిగులు గా ఆయన్ని చూస్తుంటే..!!!" నవ్వొచింది నాకు ఆమాటలకి. నవ్వుని ఆపుకున్నాను... " నిజం చెప్పు నీ ముందు ఎవరైనా కూర్చుని అట్టా దిగులు గా నేల వైపు చూస్తూ నిన్ను ఎందుకు పట్టించుకోకపోతే నీకు కోపం రాదా?" ఉలిక్కిపడ్డాను నేను ఒక్కసారి .  ఇందాకటి నుండి వాళ్ళునాతో  మాట్లాడటానికి చాలా ప్రయత్నిస్తున్నా నేను దిగులు గా మాట్లాడకుండానే ఉన్నాను, ఎన్ని ప్రశ్నలు వేసినాకూడా .....! నిజానికి నా పైన కోపం వచ్చిందేమో వీళ్ళకి !! అయినా నా మీద కోప్పడటానికి వీళ్ళెవరు ...? "అయ్యో!!! అలా కాదు మారాజా... మరి అన్నం ఆ పరబ్రమ్మం కోప్పడితే నీకు మళ్లీ  బువ్వ దొరుకుతుందా చెప్పు ...? నీ మీద మాకు ఏ  కోపం లేదు కానీ, బువ్వ తిను బాబూ... చల్లారిపోతే మళ్లీ  బాగోదు" నా మనసుని నా ముఖాన్ని కూడా చదివేస్తునట్టు వాళ్ళు అలా ఎలా మాట్లాదగాలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా...? తిని చెయ్యి కడుక్కుని లేచాను.

 ఇక ఉండబట్టలేక అడిగేశాను వాళ్ళని " అసలు  మీరెందుకు నన్ను వెంబడిస్తున్నారు? నా దారిన నేను పోతూ ఉంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? ". "అడ్డుపడటానికీ అడ్డం చెప్పటానికీ మేము ఎవళ్ళం బాబు? సాటి మనిషివి కష్టం లో ఉన్నావని సాయం చెద్దామనుకున్నాం కానీ  నిన్ను చూస్తే మాకు బాగా కావాల్సిన వాడివనిపించి ఇట్లా నీ యనకబడి వస్తున్నాం" అన్నాడు నాతో. " నేను మిమ్మల్నెప్పుడూ చూడలేదు, మీరు నా బంధువులూ కారు , మరి ఎం ఆశించి చేస్తున్నారు ఇదన్తా...? మీరు అనుకుంటునట్టు నా దగ్గర ఎం మిగల్లేదు! మీకివ్వటానికి ".

దానికి సమాధానం గా ఆ ఆడమనిషి నాతో " బాబూ నీకో మనిషి గురించి చెప్పాలి, ఒక పావుగంట మా గురించి ఆ మనిషి కథ విను ఆ తరవాత నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు బాబు . ఎందుకు మేము ఇదంతా చెప్తున్నామంటే మా కళ్ళ ముందు ఒక మనిషి చెడిపోవటం చూడలేము. మాకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఆ మనిషి గురించి తలచుకుంటేనే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది . మా మీద దయ వుంచి ఒక్క 15 నిమిషాలు మా మాటలు విను ఆ తరవాత నీ ఇష్టం సామి. " అంటూ వాళ్ళు నన్ను కట్టిపడేసినట్టు చూస్తుంటే ఏం  మాట్లాడలేక కూర్చుండిపోయాను. అతను చెప్పటం ప్రారంభించాడు.

               " బాబు మేము చెప్పాలనుకున్న మనిషి పేరు కృష్ణమూర్తి గారు, మేము అందరం మా పెద్ద కిష్టన్న అని అభిమానం గా పిల్చుకుంటాం. నిజంగా ఆ పేరు చెబుతూంటే మాటలు రావట్లేదయ్యా ... మేము ఇప్పుడు బ్రతికున్నామంటే ఆయన వల్లే... " అన్నాడు . ఆయనది మా ఊరు కాదు, మా ఊరు కి ఆయన పెద్ద గాలివాన వచ్చిన ఏడాదే వచ్చారు , ఉన్న ఆస్థి అంతా  హరించుకుపోయి వట్టి చేతులతో కట్టుబట్టలతో వచ్చారు ఆయన భార్య తో సహా . 'ఉన్న పంటంతా ఆ వాన దేవుడు ఎత్తుకుపోతే నవ్వుతూ నిల్చున్నాడట ఆ మనిషి', అని  ఊరంతా వింతగా చెప్పుకునేది అప్పట్లో. ఆ నవ్వుల తోనే మా ఊళ్ళో కి వచ్చారు వాళ్ళిద్దరూ, ఆయన మా ఊరు వదిలి వెళ్ళేంత దాకా ఆ నవ్వు అట్టాగే ఉంది ఆయన ముఖం పైన. చెట్టూ చేమా ఊరూ వాడా గొడ్డూ గోదా అన్నీ కళ్ళ ముందే కొట్టుకు పోతా ఉంటే నిమ్మళ్ళంగా ఎట్టా ఉండగాలిగాడో దొరా అని అనుకునే వాళ్ళం. ఎర్రటి ఛాయా...  కోల ముఖం....  పెద్ద తాటి చెట్టంత ఎత్తు, చూడగానే చెయ్యెత్తి దణ్ణం పెట్టాలి అని అనిపించేలా ఉండేవాడు. ఆయన భార్య కూడా ఆ పెనిమిటి కి తగ్గ ఆడ కూతురు, పసుపు పచ్చటి ఛాయా తో మెరిసిపోయేది ఆ తల్లి. ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా లేదు అనేమాటే వచ్చేది కాదు. ఎంత కష్టం లో ఉన్నా కూడా చెప్పుకునేది కాదు, ఊళ్ళో ఆ పూటకి కడుపు నిండని వాళ్ళందరికీ ఆ ఇంటి అరుగే అన్నపూర్ణ. ఎంత మంది కడుపులు నిండాయో ఎన్ని నిండిన మనసులు ఆశీర్వదించాయో... తిన్న చేతులు కడిగిన పెరటికి తెలుసు!! ఎంత మంది సమస్యలు తీర్చిందో ఆ ఇల్లు... ఎన్ని కన్నీళ్లు తుడిచిందో ... ఆ అరుగు కి తెలుసు!!!.

మా కిష్టన్న ఉంటే మా ఊరికే ఓ బలం. మాకు ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా మా కిష్టన్న తో చెప్పుకునేవాళ్ళం, ఆయన తీర్చకపొయినా ఆ భారం ఆయన తో చెప్పుకుంటే మర్నాడే ఏటి గట్టున తేలే దుంగ లా మనసు తేలిక పడిపోయేది. ఆయన కుటుంబం అంటే అందరికీ గౌరవమే అయినా ఆయన కుటుంబం అంటే అదంతా మా ఊరంత. అసలు ఇలాంటి మనిషివి ఎలా ఉండగలుగుతున్నావ్ అని ఒక సారి అడిగేశాను ఆయన్నే. నా వైపు నీ లాగే చూస్తూ అర్థం కాలేదు వీరయ్య నువ్వు ఎం అడుగుతున్నవో, సూటిగా అడుగు అన్నాడు. " మీ ఊరు కాదు...  ఉన్న వూర్లో ఉండలేక కట్టుబట్టలతో వచ్చేసారు, మీరొక్కరే అనుకుంటే ఆ మహాలక్ష్మమ్మ గారినీ మీ వెంటే తెచ్చేసారు, రాములోరితో వచ్చేసిన సీతమ్మోరిలా మీరిద్దరూ ఊరొదిలి అడవంటి మా ఊళ్లోకే ఎందుకొచ్చారు, ఇక్కడ మీకు గాని ఎవరైనా ఉన్నారా సామీ ? మీకసలు ఇక్కడి మనుషులు ఎం ఔతారు దొరా?" అని అడిగేశాను. ఆయాన నాతో చెప్పిన సమాధానం " మనుషులు వీరయ్య అంతే!!! నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ నా లాంటి మనుషులే,  నాకు కావాల్సిందీ మనుషులే వీరయ్యా. కష్టం కలకాలం ఉండదయ్యా అలాగే సుఖమూ, కానీ సుఖానికైనా దుఃఖానికైనా మనుషులు అనేవాళ్ళు ఉండాలయ్యా మన చుట్టూ. నా వాళ్ళు అనే వాళ్ళు గుప్పెడు మందైనా లేకుండా ఎలా ఉండగలను మా ఊళ్ళో? అందరూ గాలి వానకి పోయారు నేనూ మా ఆడది మిగిలాం, ఇక కొంప గోడూ అంటావా... మనం ఎక్కడుంటే అక్కడే మనకన్నీ.  అంతే  వీరయ్యా ఈ జీవితం, మనం ఉందామనుకున్నన్నాళ్ళూ అది ఉండదయ్యా అది ఉన్నన్నాళ్ళే మనం ఏం  చేసినా ఎంత చేసినా.... దాని సిగదరగ నేను ఏడ్చిన క్షణం ఒక్కటీ  వెనక్కి రాదు, దాన్ని మార్చేసుకున్దామంటే!!!  అందుకే నవ్వేసెయ్యాలయ్యా  ఏం జరిగినా మన మంచికేనని."

అట్టాంటి సామి తప్పు చేసాడంటే నమ్మగలమా..? కానీ ఆయనా తప్పులు చేసాడు కానీ ఆయనకి ఎంతో ఇష్టమైన జీవితం కోసం తప్పు చేసిన ప్రతి సారీ దారి మార్చుకుంటూనే వచ్చాడు. ఎవరో కొంతమంది మాట నమ్మి ఏదో కొత్త వ్యాపారం మొదలు పెట్టాడు. అనుభవం లేదు అయినా ఏదో మొండి పట్టుదల తో నమ్మి ఉన్నదంతా అందులో పెట్టేసాడు, కానీ దేవుడు వేరే అనుకున్నాడు... మొత్తం పోయింది. చెయ్యెత్తి మొక్కిన ఊరే మొహం చాటేసింది. మా లాంటి వాళ్ళు పిడికెడు మంది మాత్రం రోజు కలిసేవాళ్ళం అంతే . రోజూ ఆ గోదారి వెంటే కూర్చునే వాడు నువ్వు ఇందాక కూర్చున్నావు చూడు... సరిగ్గా అక్కడే ప్రతి రోజూ వెళ్లి కూర్చునే వాడు. వారం తర్వాత ఆయన వెనక మేము కూడా లేము. ఒంటరి గా అక్కడ రోజూ కూర్చుంటున్నాడని విన్నాం. ఎప్పుడూ ఆయన మాటకి ఎదురు చెప్పని ఆ ఇల్లాలు మాలక్షమ్మ గారు కూడా ఆయనని ఎన్నో అన్నారు. మేము కూడా ఇక మా పనుల్లో మేము పడిపోయాం.

కాని ఒక వారం తర్వాత మా పక్క ఊళ్ళో ఒక హోటల్ పెట్టారని తెలిసింది, వెళ్లి చూస్తే మా కిష్టన్నే పెట్టాడు. ఆయన ధైర్యానికీ ఆ మొండితనానికి మా మతులు పొయ్యాయి. " ఏంటి ఈ మొండితనం కిష్టన్న ఎందుకీ పట్టుదలా ..? ఊరు దాటి వచ్చి ఎందుకీ సాహసం? ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో కాలం గడిపే నీకు ఈ దురాశలు ఎవరు నేర్పించారు? అందరికీ చెప్పే నువ్వే ఇలా చెప్పించుకోవటం ఏమైనా బాగుందా?" అని మా ఊరి వాళ్ళూ, ఆయనకీ కావాల్సిన వాళ్ళూ అడుగుతున్నా, నోరు విప్పలేదు. నిజానికి ఆయన మా ప్రశ్నలకి మాటలతో కాకుండా కాలం తో సమాధానం చెప్పించాడు. పట్టుదల తో ఆ హోటల్ నడిపాడు, తనకి తెలిసిన వంటకాలనే మరింత రుచి గా వండించే వాడు అంతకన్నా రుచిగా వడ్డించే వాడు. ఆయన పట్టుదలో ఆ అమ్మ చేసిన పూజలో కానీ ఎంతగా  పోగొట్టుకున్నాడో అంతకు అంతా సంపాదించుకున్నాడు పేరూ డబ్బూనూ. మా జిల్లా అంతటా మా కిష్టన్న హోటల్ పేరు మారుమోగిపోయింది. అలాంటి సమయం లో ఆయన హోటల్ ని ఎవరికో అమ్మేసి మళ్లీ మా ఊరొచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. అప్పుడిక ఆ ఊర్లో ఏ నోరూ ఆయనని ప్రశ్నించే ధైర్యం చెయ్యలేదు. ఆ మాలక్ష్మమ్మ గారు మా ఆడోళ్ళతో చెప్పిన మాటలతో అన్ని ప్రశ్నలూ సమాధానాలతో మూతబడ్డాయి.

 " చూడండి ఆయనకీ ఈ మట్టంటే చాలా ఇష్టం అట్టాంటి మట్టిని కూడా అమ్మేసి తెలియని వ్యాపారం లో నష్టపోయి ఆయన ఎంత నలిగిపోయాడో ఎంత బాధ ని పంటి బిగువున పెట్టుకున్నాడో నాకు తెలుసు... అంతకన్నా ఎక్కువ బాధ నేనూ పడ్డాను. ఇద్దరం కూర్చుని ఆలోచించాం ఆ ఊర్లో వరదలకి పొతే ఈ ఊర్లో వ్యాపారానికి పొయ్యాయి సంపాదించినవన్నీ పేరుతో సహా ఇక్కడ. ఆయన ఎక్కడ చెయ్యకూడనిది చేసుకుంటాడో అని తగని భయపడేదాన్ని. ఉండబట్టలేక అడిగాను ఏం చేద్దామనుకుంటున్నావయ్యా అని. దానికాయన... "నేను మళ్లీ తెలియని పనులు చేసి నిన్ను కష్టపెట్టలేను.. అలాగని పని ఇమ్మని ఈ ఊర్లో చెయ్యి చాచి అడగనూలేను.. ఇక నాకు తెలిసిన విద్య వంట. పక్క ఊర్లో ఆ వ్యాపారం బాగా ఉంది, నేను ఇక్కడ పోగొట్టుకున్నంత వరకు అక్కడ సంపాదించుకుంటా మళ్లీ ఈ మట్టి లోకే వచ్చి వ్యవసాయం చేసుకుందాం. నాకు నమ్మకముంది లక్ష్మి తప్పకుండా మళ్లీ నేను నా స్థాయి లో నిలబడగలనని, ఇక నువ్వే నా కొత్త వ్యాపారానికి పాత భాగాస్వామివి, నీకు నేను నాకు నువ్వుగా మళ్లీ మన ప్రయాణం మొదలు పెడదాం" అన్నారు.

కొన్నాళ్ళకి అక్కడ మాకు లాభాలు వచ్చాక నేను అడిగాను, "ఇక్కడ కష్టపడి సంపాదించాక మళ్లీ ఆ ఊరెందుకు అని ?" దానికాయన " కన్న తల్లినీ జన్మనిచ్చిన ఊరునీ  సాయం చేసిన మనుషులనీ  మర్చిపోకూడదు లక్ష్మీ,  ఏమీ లేకుండా మనం ఆ ఊరు వచ్చినప్పుడు, సొంత వాళ్ళ కంటే ఎక్కువగా చేరదీసిన మనుషులనీ ఆ మట్టినీ ఎలా వదలగలను?  మనం కిందపడ్డా పైకి లేవగలుగుతున్నామంటే ఆ గొప్పదనం మన కాళ్ళల్లో కాదు మనకి ఈ జీవితం నేర్పిన విలువల్లో ఉంది ఆ బలం. ఇప్పుడు మనల్ని నిలబెట్టిందీ ఆ విలువల్లోని నమ్మకం. ఈ జీవితం లో సంపాదన అంటే డబ్బుని ఒక్కటే కాదు పేరూ, ప్రేమా, క్షమా, ఇష్టం, ఆనందం అన్నీ. దేనికి మనం ఎంత విలువనిస్తే జీవితం అంత విలువైనది గా ఉంటుంది." ఆయన మాటలు విన్నాక అర్థమైంది నాకు ఆయన అన్నిటికంటే విలువనిచ్చేది  ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ మట్టి మీద కృతజ్ఞతకని."

 బాబు ఇప్పుడు ఇక నీ ఇష్టం దొరా ఏమి చేసుకుంటావో.... కానీ జ్ఞాపకం ఉంచుకో సామి నువ్వు నీ జీవితం లో దేనికి ఎంత విలువ ఇస్తున్నావో ...? నీ జీవితం ఎంత విలువైనదో ....? చచ్చేంతటి కష్టం అందరికీ వస్తుంది దొరా...  కానీ బ్రతకాలన్న ధైర్యం మాత్రం జీవితాన్ని ఇష్టపడే వాళ్ళకే ఉంటుందయ్యా. ఇప్పుడు ఎందుకూ పనికి రాదు అనిపిస్తున్న నీ జీవితం ఎంత విలువైనదో కొంత కాలం పోయాక నీకే తెలుస్తుంది బాబు.

ఈ మాటలు చెప్పేసి వాళ్ళు వాళ్ళ దారిన వెళ్ళిపోయారు, వర్షం కూడా నిమ్మళ్లించింది... నాకు ఎమీ పాలుపోక అక్కడే కూర్చుండిపోయాను.  ఆ కిష్టన్న కథని నెమరు వేసుకుంటూ...దేనికి ఎంత విలువ ఇస్తున్నానో అని బేరీజు వేసుకుంటూ. చాలా కట్టిపడేసాడు నన్ను వాళ్ళ పెద్ద కిష్టన్న. వీలయితే ఆయనని కలవాలనిపిస్తోంది.

Thursday, July 18, 2013

కాలం నేర్చిన కళ


ఆమని కోకిల సుస్వరాల గానాలు ...
వేసవి మల్లెల నయగారపు వెచ్చందనాలు...


స్వాతి చినుకుల తొలకరి రాగపు క్షణాలు....
హిమకాంతులు ప్రసరించే శరద్గణాలు...


పుష్యం పండించే సంక్రాంతీ ముంగిళ్ళు....
పండుటాకులు స్వాగతించే శిశిర సందళ్ళు...



పులకించిన ప్రకృతిచ్చే వరాలకివే ఆనవాలు.... 
కాదని కాలగతిని శాసించే మానవుడు శివగంగ పాలు...!!!!

Sunday, July 24, 2011

నాకు దేవుడంటే చాలా ఇష్టం...


నేను ఏడిస్తే ఆయన ఓదారుస్తాడు..
ఆనందలో తేలియాడితే తానందులోనే దాగుంటాడు
బాధ గా ఉందంటే నన్ను దగ్గరికి తీసుకుంటాడు..
ఒంటరినీ అంటే తానున్నానని గుర్తు చేస్తాడు...
తన్మయత్వం తో కౌగిలించుకుంటే తల నిమురుస్తాడు...

చిన్న పిల్లాడిలా మారాం చేస్తే చిలిపిగా నవ్వేస్తాడు...
నా వల్ల కాదని చేతులెత్తేస్తే తన చేయందిస్తాడు...
భక్తి భావం కంటిలోకి ఉప్పొంగితే ఆ నీటితో మనఃశుద్ధి చేస్తాడు
నీవే తప్ప దిక్కులేదని వేడితే మరేం అలోచించక నాకై వచేస్తాడు..

నేను భయపడితే తానే ధైర్యమౌతడు...
నేనేమౌతానో అనుకున్నప్పుడు...నా దారీ వెలుగూ తానౌతాడు..
ఏమీ వద్దనిపిస్తుంది ఆయన తోడుంటే..
ఏమీ అడగాలనిపించదు ఆయన్ని చూస్తుంటే..

ఏ పలుకూ పెదాలు దాటనంటుంది ఆ నామస్మరణ జరుగుతున్నంత సేపు...
ఏ అలోచనలూ నన్ను తాకనంటాయి ఆ చల్లని చూపు నాపై ప్రసరిస్తున్నంత సేపూ...

నాకై ఇన్ని చేసిన అ అంతర్యామికి నేనేమివ్వగలను..?
నిర్మల మైన మనసు... నిజయితీ గల మాటా తప్ప
నా జీవితం లో అడుగూ ఆయనే...గమ్యం అయనే...మార్గమూ ఆయనే...



Saturday, January 1, 2011

నిన్నటి తరం.....

తరమెళ్ళిపోతోంది...
గురుతర బాధ్యతలు మ పై వదిలి...
తాతల తరం తరలెళ్ళిపోతోంది...

ఉప్పెక్కించుకున్న వీపు విశ్రాంతి కోరింది...
లోకాన్ని చూపించిన వేలు ఇక కనిపించనంది...
కలల అలల పై ఆడించు ఒడి కాలక్రీడకు ఓడిపోయింది...
కథల తోటి మా వ్యథలు తీర్చిన మాట మూగబోయింది..!!!
తరమెళ్ళిపోతోంది...
తాతల తరం తరలెళ్ళిపోతోంది...
రేపటిని మాకిచ్చి నేటికి నిన్నలా మిగిలిపోతోంది...!!!


స్నేహ శీలతే సంపద గా..
మానవీయతే మన్నన గా...
నమ్మిన విలువలే వెల లేని సిరి గా...
నమ్ముకున్న వారి ఆదరణే తన విధిగా...!!!
నడయాడిన ఓతరం
తమ జాడలు మాకై వదిలి...
ఇక శెలవంటూ వెళ్లిపోతోంది...కాల గతి లో మళ్ళిపోతోంది..!!


కడగండ్లకు తల వంచని మనోస్థైర్యమే శ్వాసగ...
భేషజమెరుగని బోసినవ్వులే తన బాష గా...
ప్రతిదినమున అగుపించే సూర్యోదయమే తన ఆశగా...
పరోపకరమే పెన్నిధిగా...పరమానందమే పరమావధిగా...!!!!
బ్రతికిన ఆ తరమెళ్ళిపోతోంది...
మా తప్పులను సరిచేయు అనుభవాల తరువు తరిగిపోతోంది...!!!

Monday, December 13, 2010

నా కలలు...

నా కలలు...
సినిమాలలో చూపించినట్టు మిమ్మల్ని నేనిప్పుడు నా స్వప్న లోకం లోకి తీసుకెళ్ళబోతున్నాను....నా స్వప్న లోకమంటే....నా స్వప్నాలు...ఎలా నిజమయ్యి ఈ లోకం లో నాకెదురయ్యయో మీకు పరిచయం చెయ్యబోతున్నాను....మనిషి నమ్మి అనుకుంటే....నిర్మలం గా మనసుని ఉంచుకుంటే...ఆ పై తన కలలని గమ్యాలని తనలో నిక్షిప్తం చేసుకుంటే...తన కర్తవ్యమే తాను గా భావించుకుంటే...చెయ్యలేనిది...చేరలేనిది లేదు....అన్ని కలలూ నిజమవ్వవు...వటిలో నిజాయతీ...నిర్మలత ఉంటే తప్ప... !!!

ఇక నా అనుభవాలు....
కలలు కలలు...అని నా స్వోత్ఖర్ష లో నేను రశినట్టుగా....నా కలలు చాలా నిజమయ్యాయి....అవి ఉత్త కలలే అని నేను అనుకొని ఉంటే అది నా పొరబాటే...ఆ కలల ని ఇక్కడ ప్ర్స్తవించలని...అవి ఏ క్రమం లో నిజమయ్యయో చెప్పలని నా ఈ ఆరాటం...

నాకు సినిమాలంటే తగని మోజు....సినిమాలు ఈ విధం గా తియ్యలనీ....ఈ విధం గా ఉంటే బాగుంటుందనీ...చాలా విధాలు గా అనుకునేవాడిని నేను ఇంటర్ లో ఉన్నప్పుడు...ఇంకా సినిమ ఫీల్డ్ కి చాలా దగ్గరగా ఉండాలని కోరుకునే వాడిని....ఉద్యొగం వస్తే హైదరాబద్ కి ఎదొ ఒక కారణం చెప్పి వెళ్ళాలని..చాలా మంది పాత తరం కొత్త తరం దర్శకులని...నటులని...ఇంకా ఎంతో మంది సినీ దిగ్గజాలని కలుసుకోవాలని...వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవాలని...కోరిక ఉండేది...అంతే కాదు ఒక పాటల రచయత గా అవ్వలని ఎన్నో కలలు కనే వాడిని....

ఇవన్నీ నా కలలు....కలలు అంటే...పగటి కలలు కాదు గట్టి కలలు...నాలో నిద్రాణమై పొఇన నా ఉచ్చ్వాశ నిస్వాశలు....ఆ కలలు ఎంత ఘదమైనవి అంటే...నన్ను నేను మర్చిపోయి నేను వాటిలో లీనమైపోయేంత...నా గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు...ఆ కలల గురించి మత్రమె ఆలోచించాను....అవి లేకుంటే అనె ఆలోచన అసలు వచ్చేది కాదు...అలా అని అవె నా ప్రపంచం...అవే నా ప్రాణం అని అనుకోలేదు...వాటిని సాధించటం కోసమే ఎమొ నేను ఉన్నది అని అనుకొని...నా ఇతర కలలని గమ్యలని అనుకుంటూ....వచ్చే ప్రతీ మలుపు ని ఆస్వాదిస్తూ..ఆ పై కలల గురించి అలోచించటం మర్చిపొయి...పట్టించుకోకుండా...నా పని నేను చెసుకుంటూ గడిపాను...!!!
నిద్ర పొయెటప్పుడు యదృచ్చికం గా వచ్చిన కలలు కావవి...నన్ను నిత్యం నిలబెట్టిన గమ్యాలు...నడిపించిన మార్గాలు...

నా లిఫె లో ఎప్పుడో ఒక సరి జరిగితే చాలు అనుకున్న అద్భుతం...నా కళ్ళా ముందు అచిరకాలం లోనే ఆవిష్క్రుతమైనది...

1)పాటల రచయత గా అవకశం...
నేను ఎవొ కవిత లురాసుకునే వాడిని...అవి ఎవరినో మెప్పించాలనో ....ఇంకా ఎవరి మన్ననలు పొందాలనో కాదు...నా మనసు పలికీన భావలని అక్షరాలు గా ఆ సరస్వతి నాకిచ్చిన వరం గా భవిస్తూ...నేను అనుకున్నది అలా రాసుకుంటూ వచ్చను...అవి కొనదరికి చూపెట్టటం కాకతాలీయమే...నా ఉద్దెశ్యం ఈ కవితలతో పాటల రచయత గా అవ్వలని ఏ మత్రం కాదు...ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు...కాని ఈ కవితలు చదివి మెచ్చుకున్న ఒకాయన...నాకు తను తీయబొయె సినిమా లో చంచె ఇస్తనని..ఇది మాట వరసకు చెప్పింది కాదని...గట్టిగా మాటిచ్చాడు...
ఇది యాదృచ్చికమో ఎమొ తెలియదు....నా కల నిజమయ్యింది...పాటల రచయత గా అవకశం రావటం... ఆ అవకాసాన్ని..నేను ఉపయొగించుకున్ననో లేదో నా కలలకి అనవసరం....!!! అవకసం వరకే వాటి పని అంతే..!!!

2)సినిమా ఫీల్డ్ కి దగ్గర గా...
నా ఉద్యొగం ఊహించని ఎన్నొ ఆశ్చర్యాలకి లోను చేసింది.....కరూర్ వైశ్యా బాంక్ లో ప్రొబేషినరి ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది...పోస్టింగ్ జూబ్లీహిల్స్ లో....ఇక్కడే నా కలల్లో ని గాఢథ అవి నిజమైన విధానం...కాలం నన్ను పరీక్షించి నిరీక్షింప చేసిన విధానం చెప్పాలి...

నన్ను...నా తో పాటు ఇంకొక అతన్నీ జూబ్లీహిల్స్ లో వేసారు...కానీ జూబ్లీ హిల్స్ కి ఇద్దరు ఆఫీసర్లు అవసరం లేదని...ఒకర్ని మైన్ బ్రాంచ్ కి వెయ్యలని అన్నరు...అప్పుడు ఆ ఇంకొక అతన్నే మైన్ బ్రాంచ్ కి వేసి...నన్ను జూబ్లీ హిల్స్ లో నే ఉంచారు....

సో సినిమా ఫీల్ద్ కి దగ్గర గా హైదరబాద్ లో ఉండాలాన్న నా కల ఒకటి, ఏ కష్టం నేను పదకుందానే తీరిపొఇంది...ఉద్యోగం లో చేరాక ఎలగైన హైదరాబాదు వెళ్ళి తీరాలన్న నా కోరిక...హైదరబాదు జూబ్లీహిల్స్ లో పొస్టింగ్ పడటం తో నమ్మలేని ఆశ్చర్యానికి...ఆనందానికి..నన్ను గురిచేసింది....

3)ఇక ముఖ్యమైన వ్యక్తులని కలుసుకోవటం....
నేను ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలంటే...అది సామన్యమైన విషయం కాదు..కలుసుకోవటం వేరు...వారి తో అనుబంధం కొనసాగించటం వేరు...నాకు బాంకింగ్ అంటే చాలా కొత్తగా ఉండేది...ఎన్నో పొరబాట్లు చేసేవాడిని...అర్థమయ్యేది కాదు ఒక పట్తన ఏది...!!!ఆ తైం లో మా బాంక్ లో గోల్దన్ విజన్ అని 2016 కి లక్ష కోట్ల బిజినెస్స్ చెయ్యలని...అందుకోసం ఇప్పటి నుంచే మర్కేటింగ్ లో పట్టు సాదించాలని...కష్తమర్ బేస్ పెంచుకోవాలని...కొన్ని ఎంపిక చేసిన బ్రాంచీలలోనే ఈ గోల్డన్ విజన్ ఏర్పాటు చేసారు....
ఆ ఎంపిక చేసిన బ్రాంచి లలో జూబ్లీహిల్స్ ఒకటి...

అయితే నేను మార్కెట్టింగ్ ఆఫీసర్ ని కాను...కొత్తగా చేరిన ప్రొబేషినర్య్ ఒఫ్ఫిసర్ ని...ప్రొబషన్ లో మర్కేట్తింగ్ ఆఫీసర్ ఇవ్వటం అరుదు...అందులోనూ అదీ జూబ్లీహిల్స్ లాంటి వీఅయిపీ లు ఉన్న ఏరియాలలో...ఇంకా కష్టం....కాని నన్ను మా బ్రాంచ్ లో కష్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్ గా వేశారు...అదీ సరదాగ ఆయాచితం గా కాదు...నకన్నా సీనియర్స్ ఉన్నా కూదా...అందరినీ అడిగాక...ఎవ్వరికీ కరక్టుగా ఈ పొజిషన్ సరిపోక...చివరకి నా దగ్గర వచ్చి ఆగింది..నేను అడిగింది కాదు...నాకు తెలిసింది నేను చేసిందల్లా...నాకు అది ఇంటరెస్టింగ్ అని చెప్పటమే...

నేను ఇప్పుడు కాదనుకున్నా, నా ఉద్యోగం లో భాగం గానే...నేను పైన చెప్పిన వాళ్ళందరినీ కలవాలి...తప్పకుండా నేను వల్లతో రెలేషన్ మైంటైన్ చెయ్యాలి...ఎందుకంటే నేను కష్టమర్ రిలేషన్ ఆఫీసర్ ని కనుక....

ఇవన్ని జరిగిన వస్తవాలు...నేను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాన..లేక జారవిడుచుకుంటానా అన్నది నా శక్తి సామర్ధ్యాలపై ఆధార పడి ఉన్న విషయం...అప్పటి నా ఇష్టం ఇంకా అలానే ఉంటే...అంతే కసి ఇంకా నాలో ఎల్లప్పుడోఓ ఉంటే..ఇంకా నేను అనుకున్న కల పై నాకు నమ్మకం అలానే ఉంచగలిగితే...ఇంకా సినిమాలో చెయ్యలని సంకల్పిస్తే....నేను ఆ గమ్యలని చేరుకోవచ్చు...ఇవేవి లేకపోతే....ననెఉ ఇక్కడే ఆగిపోవచ్చు....నేను సాధించన లేదా అన్నది నా మీద ఆధార పడి ఉన్నది...కాని అవన్ని నాకు దగ్గర చేసిందీ మాత్రం నా కలే...నా ఎనలేని ఇష్టాలే...నేను ఎల్లప్పుడోఓ నమ్మే...ఆ భగవంతుడే...

అన్ని కలలూ నిజమౌతాయా అంటే అవ్వవు....కలకి నిజాయతి ఉండాలి...స్వచ్చత ఉందాలి...స్వార్థం ఉందకూడదు...ఎప్పుడూ అది జరగదని అనుకోకూడదు...నిరుత్సాహ పడకూడదు...నాకేంటి అని ఆ కలలని అడగ కూడదు....ఓపిక గా వాటిని నమ్మాలి...జరుగుతున్నదంతా మన మంచికే అనుకోవాలి...ఆ కలే మనం గా భావించాలి...ఆ కలని మనను వేరు గా భావించకూడదు...ఎప్పుడైతే ఆ కల లోకి నేను అనే అహం ప్రవేశిస్తుందో...నాకేంటి అనె ప్రశ్న ఉద్భవిస్తుందో...ఆ కల పై మనకు నమ్మకం పోతుంది...ఆ కలకి కూడా మన పై విస్వాశం పోతుంది...అప్పుడవి ఉత్త కలలే...హా ఇంకో విషయం....నాకు సరైన ఉద్యోగం రాలేదని...కాంపుస్ సెలక్షన్స్ లో సెలక్ట్ అవ్వలేదని...చాలా బాధ పదే వాడిని...ఇంజినీరింగ్ లో....ఇంకా ఉద్యోగం మంచిది ఎప్పుడొస్తుందో అని విచారించే వాదిని...ఎన్నో పరీక్షలు...ఎన్నో ప్రశ్నలు...నా కలల పై అనుమానాలు..నా మీద నాకే అనుమానం కలిగించే సంఘటనలు....నేను ఎదొ సాధించానని చెప్పటలెదు....నేను ఎదో సాధించ్చేందుకు...నా కలలు నాకో మార్గాన్ని చూపాయి...వాటి లో పయనించాల్సిన బధ్యత నాది....ఇక మిగిలింది మనమే చెయ్యలి...కలలు మనకో గమ్యాన్ని...ఒక అవకాసాన్ని మాత్రమే ఇస్తాయి....వాటిని సద్వినియొగం చేసుకోవల్సింది మనమె....మీ మనసు ఎంత ధృఢమైనదైయితే..ఎంత నిర్మల మైనదైయితే..ఎంత స్వ్చ్చం గా కలలని ప్రేమించగలిగితే...మిమ్మల్ని మీరు ఆ కలలలో మర్చిపోగలిగితే...అంత త్వరగా మీ కలా నిజమౌతుంది....

ఇక్కడ కల అంతే నేను ఉద్యొగం సంపాదించాలనే...ఉద్యొగం సంపాదించాకా ఆ డబ్బుతో కార్లు..ఇళ్ళు షేర్లు...కొని....కోటీశ్వరుడి కూతుర్ని పెళ్ళాడి...ఆనందంగా కోట్లు గదిస్తూ...హాయిగా పదవీ విరమణ చెయ్యటం కాదు...!!! అది మనం గుర్తుంచుకోవాలి....ఎం చెయ్యలన్నది మన బధ్యత ఎలా చెయ్యలి అన్నది...ఆ భగవంతుని ఇష్టం..ఆ కలల కర్తవ్యం..!!!

చివరిగా భగవద్గీత లో చెప్పినట్టుగా....కర్తవ్యం ఆచరించటం వరకే మనకి హక్కు...వాటి ఫలితాలపై కాదు....
కలలకి కూడా అంతే....!!! నాకు ఈ ఫిలాసఫ్య్ ఏ జి క్రిష్ణమూర్థి గారు రాసిన పుస్తకాల లోంచి అబ్బింది...వారికి నా కృతజ్ఞతలు...ఆయన పుస్తకాలు చదివితే మీకు మరింత విపులం గా అర్థమౌతుంది...!!!కలల గురించి...వాటి శక్తి గురించి....!!!