Wednesday, February 1, 2017

ఉత్తరాయణం

సూర్యుడు మీనం నుంచి మేషం లోకి ప్రవేశించటానికి సిద్ధపడుతున్న కాలం. చలీ చీకటీ రెండూ గాఢాలింగనం చేసుకుని  హోరు గాలిని తమతో కలుపుకుని రాగాలు శృతి చేస్తున్న రోజులు.  కణ్వాన్తర కుటుంబాలకి ఇంకా చేరుకోని తొంభయ్యో దశకం.  ఆ ఇంట్లో అందరి లోనూ ఏదో ఉత్సుకత, తెలియని ఉద్వేగం. ధనుర్మాసం అంటేనే  సూర్యుడు మాత్రమే కాదు వృద్ధులూ ఉత్తరం వైపు ప్రయాణానికి సన్నద్ధమౌతుంటారని అంటూంటారు. అటువంటిదే అక్కడ చోటు చేసుకుంటోంది. ఆ ఇంటి పెద్ద తాత గారు బాగానే ఉన్నారు అప్పటి దాకా .. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు మంచాన పడుకున్న వాడు ఎగశ్వాస తీస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న పిల్ల మేక అందరూ ఆ గది లోనే ఉన్నారు... ఏమౌతుందో అని. అప్పుడే హడావిడి గా ఆ ఇంటి వైద్యుడు వచ్చిఆ పెద్దాయన పక్కన కూర్చుని, ఆయన తో మాట్లాడుతూ... నాడి చూసి ఆ పెద్దాయన చెవిలో ఏదో చెబుతూ, ఆయన తెచ్చుకున్న సంచి లో నుంచి ఒక సూది తో మందు ఇచ్చాడు. కాస్సేపాగి మళ్ళీ నాడి పట్టుకుని "ఇప్పటికి మరేం పర్వాలేదు", అనేసి వెళ్ళిపోయాడు ఆ ఇంటి పెద్ద కొడుకుని వెంటబెట్టుకుని.

" నారాయణ మరేం పర్వాలేదు ప్రస్తుతానికి.. కానీ పెద్దాయన కదా ఎప్పుడు ఏం వస్తుందో చెప్పలేం. అన్నిటికి సిద్దపడి ఉండండి. ఇంతకన్నా ఏమీ చెప్పలేను. హా...! ఆయన కి ఏమి కావాలంటే అది పెట్టండి, పథ్యం ఏమీ అక్కరలేదు. అయినా ఎంత సంతృప్తి గా ఉంటే అంత ఆనందంగా ఉంటాయి చివరి రోజులు". పెద్ద కొడుకు తో అన్నాడన్న మాటే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విన్నారు ఆ మాటలని.  ఆ మంచాన ఉన్న పెద్దాయన... ఆయన సగభాగం ఆ పెద్ద ముత్తైదువ తో సహా. అందరూ గుండె దిటవు చేసుకుంటున్నారు ఎవ్వరికైనా తప్పక వచ్చే స్థితి ఇది. కాలం తన ధర్మం తాను చేసుకుని వెళ్ళిపోతుంది కదా. ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా దానికి ఈ లెక్కలతో పని లేదు. తన పనికి అసలు ఇవి ఏవీ అడ్డు రావు. మౌనం గా ఈ సత్యాన్ని అందరూ అర్థం చేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు ఆ పెద్దాయన సంపూర్ణ దేహం తో సహా.


చీకటి చిక్కబడుతోంది అందరూ నిద్ర లో ఘీంకార స్వరాలు వల్లే వేస్తున్నారు. అంత మధ్య రాత్రి లోనూ నిద్ర పట్టక కన్నులు తెరవక తెలియని బాధ ని కంటికీ రెప్పకీ మధ్య దాచుకుని ఇబ్బంది పడుతోంది సుబ్బమ్మ గారు, ఆ ఇంటి పెద్ద తాతగారి ధర్మపత్ని. ఎన్ని భగవన్నామాలు చెప్పుకున్నా నిద్ర రాదే... ఎంత ప్రయత్నించినా బాధ మనసు దాటి పోదే.. ఇదంతా సహజం ఎప్పుడో ఒకప్పుడు తనకి కూడా తప్పదు..  ఇవన్నీ తెలుసు! ఎన్నో పురాణాలూ చదివింది, మరెన్నో విన్నది ఇంకా వేదాంత జ్ఞానం జన్మతః అబ్బింది. కానీ ఎక్కడ నుంచి వస్తోంది ఇంకా ఈ బాధ. అవును ఆ మంచాన ఉన్న మనిషి వల్ల వస్తోంది. ఆయనకి బాగా లేదు అని తెలిసినప్పటి నుంచీ వస్తోంది. అందరూ అన్న మాటలు గుర్తొస్తూంటే వస్తోంది...  ఆయన పెద్దవాడయ్యాడు కదా మనం ఆ సత్యాన్ని గుర్తించాలి అని అంటున్నారు... ఇంకెవరో అన్నారు ఆయనకీ ఎనభై దాటాయి అని... అవును ఎనభై దాటితే మనిషి చచ్చిపోవాలా? సరిగ్గా అప్పుడే రివ్వున మనసు ఒక్కసారి బుద్దిని తాకి కన్నీరుగా చెంప పైన వాలింది... ఆ పైన చీర కొంగు లో దాగింది. ఇప్పుడు మళ్ళీ కంట్లోకి వచ్చి చేరింది ఆ బాధ.  అప్పుడే జ్ఞప్తి కి వచ్చింది ఆవిడకు ఆయన వయసు! మరి తన వయసో ... ఎప్పుడూ ఆయన కన్నా ఏడేళ్లు చిన్న అని చెప్పటమే కానీ ఇంతా అని నిక్కచ్చి గా తనకీ తెలియదు. వాళ్ళ డెబ్భై ఏళ్ళ స్నేహం లో తనకి ఎపుడూ గుర్తుకు రాని ఆలోచన అది. ఎవరో వాదించుకుంటున్నారు కృష్ణాష్టమికి పుట్టాడు రా అని అంటే ... కాదు భద్రపదం లో పుట్టాడు రా అని... అధిక మాసాలు అన్ని కలుపుకుంటే తొంభయ్ దాటుతాయని మరికొందరు ఇలా చర్చించుకుంటూ, ఆ పెద్దాయనకి మందు ఇచ్చేశాక  ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. కానీ సుబ్బమ్మ గారి దారి మాత్రం అక్కడి తో ఆగిపోయింది.

ఆ పెద్దాయన చిన్నగా చలికి వణుకుతున్నారు... కాదు మెల్లగా స్పృహలోకి వచ్చారు. ఎదో కావాలి ఈ జీవుడికి అని అంటూ లేచి వెళ్తున్నారు సుబ్బమ్మ గారు. ఎవ్వరూ ఆ మాటలు వినే తెలివితో లేరు.


మెల్లగా వెళ్లి వైద్యుడు కూర్చునే బల్ల మీద ఆ మంచం పక్కన్నే కూర్చుని చూస్తోంది ఆ ముదుసలి కళ్ళ వైపు. కాస్త మంచి తీర్థం నోటికందిస్తూ. అటు ఆయనకీ తన పరిస్థితి తెలుస్తోంది. చలికి వణుకుతున్నాయేమో గట్టిగా  పట్టుకుంది... అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతూ కొంగు ముడితో కలిపి  తన చేయి పట్టుకున్నవాడి చేతిని. ధర్మేచా.. అర్థేచా... కామేచా... నాతిచరామి అని ఆపేసారు పెళ్లి లో... మరి మోక్షం లో? ఇక్కడ ఎవరి దారి వాళ్లదే ఇక్కడికి మాత్రం కొంగు ముడి రాదు. మరి ఇక్కడి దాకా ఇద్దరూ కలిసి ప్రయాణం చేసాక వాళ్ళు అద్వైతమైతే...!!! ఆ బాధే గుండెలను పిండేస్తోంది నేడు ఆ పెద్దలిద్దరినీ ఒక్కటిగ. ఆవిడ పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం రావట్లేదు ఇటు శబ్దం వినిపిస్తోందీ అర్థం కావట్లేదు. ఎప్పటిది  ఈ మైత్రి ? ఎన్నేళ్ల క్రితం పురుడు పోసుకుంది? బహుశా కొన్ని జన్మల క్రిందట కావచ్చు. కానీ ఈ జన్మ లో ఆవిడకు సరైన ఊహ వచ్చిన వయసు ఇంకా రాలేదు...  ఏడో  ఎనిమిదో ఉంటుంది. ఆయన కంటే సరిగ్గా ఏడేళ్లు చిన్నఅని మాత్రం తెలుసు. అప్పుడు మొదలయ్యింది వారి బంధం.

ఏడు దశాబ్దాలు గా ఆ బంధం అలాగే కొనసాగుతోంది. ఒకరి జీవితం అంటే ఇంకొకరు లేకుండా చెప్పటం కష్టమే! ఈ ఇంటి కోడలైన కొత్తలో ఆవిడకి ఏమీ తెలియదు ఆపైన తాళి కట్టిన వాడు తప్ప వేరే తెలియదు. "మావయ్యా నీ సుబ్బులుని నాకు ఇచ్చి చెయ్యరాదూ, బంగారం లా చూసుకుంటా" అని తన తండ్రి దగ్గర అన్న మాటలు ఆమెకు లీలగా ఇప్పటికీ గుర్తే. తానేమో పాలకుండ అడుగులా ఉంటానని ఇంట్లో అందరూ వెక్కిరించటమే... ఆయనేమో ఎర్రటి ఎరుపు. బాగా కుదిరిన జంటగా పెళ్లంటే ఒక ఆట లా జరిగిపోయింది ఆ వయసు లో. అటు పైన ఎన్ని గొడవలనీ... ఎన్ని పురుడులనీ...!!! ఆస్తులు హరించుకు పొయ్యాయి... కన్న బిడ్డలు దూరమయ్యారు కంటి ముందే..!!! పూలమ్మిన చోటే కట్టెలు కూడా... ! కొన్ని కాలనుకూలమైతే ఇంకొన్ని స్వయంకృతం. అన్నీ  కలిసే చేశారు... కలిసే పంచుకున్నారు... కలిసే కావడి మోశారు. ఈ పరమపదపు సోపాన వైకుంఠపాళీ లో చెరో పావులా కాకుండా.. ఒకరికి అర్థం మరొకరు గా ఇద్దరూ ఒక్కటిగా ఎన్నో నిచ్చెనలు ఎక్కుతూ పాములు పాలు పడుతూ ఏదిఏమైనా కలిసే  ఆనందంగా ఉంటూ...  ఎన్నో గడులు దాటి వచ్చేసారు. ఏ గడి లో ఉన్నారో కూడా ఎప్పుడూ చూసుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే ఆయన పంటకి వచ్చేసాడు మరి  తన మాటో ..?  ఈ సగాన్ని వదిలేసి తాను ఇంకెన్ని గడులు దాటాలో? ఎప్పటికి తానింక పండేనో?

తెల్లవారింది.. అంపశయ్య మీద భీష్ముడి లా ఉత్తరాయణం కోసం ఆ పెద్ద ప్రాణం కొట్టుకుంటోంది. రోజు రోజు కీ ఆరోగ్యం క్షీణీస్తోంది. అప్పుడే ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి అక్కడక్కడా. ఎవరో అంటే వినబడ్డాయి ఆ మాటలు!!! నాలుగు కుటుంబాలకి ఒకడే వారసుడు ఈయన, చాలా పెద్ద ఆస్తే వచ్చింది. కానీ అంతా హారతి కర్పూరం చేసేసాడు.  కాస్త  మిగిల్చినా కూడా కోట్లు విలువ ఇవ్వాళ. ఇంకా ఏవేవో మాటలు  అలాంటివే. ఇవి వింటున్నప్పుడు సుబ్బమ్మ గారి మనసులో ఆ జ్ఞాపకాలు మెదిలాయి. ఔను తానూ ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు నాలుగు కుటుంబాలకి కలిపి ఒకడే వారసుడు అవ్వటం చేత అందరి ఆస్తి ఈయనకే వచ్చింది. మరి అలాంటి ఆస్తి ఊరికే ఎలా హరించుకుపోతుంది? ఏవో జ్ఞాపకాలు దొంతరలను మనసు విప్పుతోంది.

ఒక రోజు చాలా సంతోషం గా వచ్చాడు ఆయన.  దగ్గరి చుట్టాల అమ్మాయి పెళ్లి సంబంధం కుదిర్చిన సంబరం అది. తనకీ సంతోషం గానే ఉంది కానీ ఏడాదిగా వర్షాలే లేవు ఎటు చూసినా కరువే. అలాంటి కరువు లో పెళ్లి ముహూర్తం ఏ ధైర్యం తో పెట్టించారు? పైగా అవతలి వాళ్ళు కట్నం కూడా ఇమ్మన్నారని విన్నది. మరి ఈ మనిషి ఎలా కుదిర్చాడు ఈ సంబంధం? " ఏవయ్యా ఎలా కుదిర్చావు సంబంధం చెప్పు ముందు అసలే కరువు కదా మరి పెళ్లంటే ఖర్చు భోజనాలు ఇన్నీ ఎలా చెయ్యగలవని ? ఏం  చేసి ఒప్పించావ్ నువ్వు?" అని మనసులో మాట అలాగే ఆయన ముందుంచింది.

"నిజమే ఇది కరువు కాలమే కానీ మనుషులం కరువు కాలేదు గా...!!! కష్టం కలిగినప్పుడే మనిషి ధైర్యాన్ని వెతుకుతాడు... అయిన వాళ్ళ కన్నా మనుషులకి ధైర్యం ఎవరుంటారు...? అందుకే పెళ్లి నేనే జరిపిస్తానని మాటిచ్చి వచ్చాను. ఒక జంట కి పెళ్లవుతుందంటే అది ఊరంతటికీ ఆనందం... ఒక ఆడ పిల్ల ఇల్లాలవుతుంది, ఆ వయసు మళ్ళిన తండ్రి బరువు దిగుతుంది. అన్నిటికి మించి తమ పూర్వికులు నుంచి వారసత్వంగా వచ్చిన విలువలు ఒక కొత్త తరం అందుకుంటుంది.  మరో కొత్త తరం పురుడు పోసుకుంటుంది. ఇంత విశేషమైన శుభకార్యం కరువు వల్ల ఆగిపోవాటానికి నా మనసొప్పుకోలేదే...ఇవన్నీ కాదు అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు అందుకే నీ మాట కూడా నేనే ఇచ్చేసాను. పెళ్లి భోజనాలకి మనకి కరువు లో ఆదుకుంటాయని గాదె లోనూ ఇంటి నేల అరలలోనూ దాచిన వరి కుప్పలున్నాయి గా అవి సరిపోతాయి...!!!  ఇక  కావాల్సిన సరుకులూ ఇంకా కట్నం...  " అనేసి అటు తిరిగి నిలబడ్డాడు ఆ పెద్ద మనిషి."... ఆ పెళ్లి జరగాలంటే ఇంకెంత భాగ్యం అమారాలో  " అనుకుంటూ.  "భాగ్యమంటే ఒంటి మీద నగలు దిగేసుకు తిరగటం కాదయ్యా ... ఏ ఆడపిల్లకైనా భాగ్యం సౌభాగ్యమే. ఇటు  చూడు నుదుటి పైన నువ్వు దిద్దిన రూపాయి కాసంత కుంకుమ... కంటి కిందే నీకిష్టమైన ముక్కుపుడక... నువ్వు కొనిపెట్టిన ఈ దుద్దులు... నువ్వు కట్టిన మాంగళ్యం. కళ్లెదుటే నువ్వు. ఈ జన్మ కి ఇంతకన్నాగొప్ప భాగ్యం ఏమని దాచుకోగలను ..." అని అంటూ తనకున్న బంగారం...నగలూ ఇస్తూ " ఆ పిల్లకి కావలసిన సౌభాగ్యం అమరనీయండి." అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది.

ఆ పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. ఆ పెళ్లనే కాదు ... నిజానికి అవసరం అని వచ్చిన ఏ మనిషీ కన్నీటి తో ఆ గడప దాటింది లేదు. ఆ ఇల్లే ఒక అన్నపూర్ణ .. అది ఆ ఇద్దరూ కలిసి చేసిన వితరణ యజ్ఞం. ఇప్పుడు చెప్పుకునే ఆస్తులే సమిధలు...  మంచి మనసు ఆజ్యం... సంతృప్తే హవిస్సు... ఆత్మానుభూతే ఆ యజ్ఞఫలం. కానీ ఇప్పుడు ఆ యజ్ఞఫలం పంచుకునే ఆ సగం ఏదీ? దాని గొప్పతనం ఎంత వివరిస్తే ఇప్పుడు వినిపిస్తున్న ఆ ప్రశ్నలకి  సమాధానం లభిస్తుంది? ఇప్పుడు అందరూ భాగ్యాలూ బంగారాలూ పోయాయి అని అంటున్నారు... అసలుకి ఇప్పటి దాకా ఆ భాగ్యం తనతోనే ఉంది.. ఇప్పుడిప్పుడే దూరమౌతున్నట్లు తెలుస్తోంది!!! తన బాధకి అసలు కారణం ఎక్కడో దొరికినట్లనిపించింది . ఎప్పుడూ ఎవ్వరికి సమాధానాలు సంజాయిషీలు ఇచ్చుకోలేదు తాను. ఆయన ఎప్పుడూ ఇది చెయ్యి అని చెప్పలేదు. ఆయన ఏది చేసినా తానూ భాగస్వామి అయ్యింది. తాను చేసేవాటిలో సగఫలం ఆయనకిచ్చేసేది. ఆయన మనసు గాయపడిన సందర్భాలన్నీ ఆవిడకు తెలుసు... తన కష్టం మాత్రం ఏనాడూ ఆ  పెదవి దాటింది లేదు. అటువంటి సప్త దశాబ్దాల స్నేహం ఈ రోజు వీడ్కోలు చెపుతుంటే గుండె పొరల్లోనుంచి ఏదో పెల్లుబికి వస్తోంది కానీ కంటి రెప్ప దగ్గర ఆవిరవుతోంది.

ఉత్తరాయణం రానే వచ్చింది పెద్ద వయసు వలన ఆ తాతగారు స్వదేహయానం చాలించారు. ఆయన  సగం దేహం మిగిలిన ప్రాణం తో కొట్టుకుంటోంది. అది ఘనీభవించిన కన్నీటి తాలూకు బాధ. ఈ సంసారం లో ఎన్నో కురుక్షేత్రాలను అవలీల గా ఎదుర్కొని గెలిచిన ఆ ఇల్లాలు శ్రీ కృష్ణ నిర్యాణానంతరం సవ్యసాచి లా మారిపోయింది. ఇంటి పెద్ద కోడల్ని పిలిచి " ఇక నేను  ఈ ఇంటి వ్యవహారాలు చూడలేను.. ఎలా చూడాలో తెలియట్లేదు అర్థం కావట్లేదు నాకు. వయసు మీరిపోయిందని అర్థమయ్యింది ఈ ఇంటి బాధ్యత మీరు ఎలా పంచుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఈ దేహం నడిచే వరకు నా ప్రాణానికి ఇంత ఆదరువు కలిపించండి చాలు." అంటూ అస్త్ర సన్యాసం చేసి తన లోకాన తానుండి పోయిందీ సుబ్బమ్మ గారు.