Sunday, August 23, 2009

నాకు నచ్చిన నా వినాయకుని కోసం...

అఖండమండలాకృతిం...

అనన్య భక్తకా స్మృతిం...

విశిష్ట విజయ సాధకం...

సతత మదిం పూజితం...

సకలాభీష్ట ఫలప్రదం...

సనాతనం...సధర్మ కర్మ రూపకం..

నమోస్తు విఘ్నవినాయకం...

నృపాధిపం...శివాసుతం...

సదానంద సన్నిధౌ భజే...!!!

Saturday, August 22, 2009

నాన్న కోసం...

ప్రపంచం పరిచయమయ్యే క్రమాన తనే నా తొలినేస్తం...
సంతోషం తో ఉప్పొంగిపోయేదా హృదయం...నా చిన్ని విజయానికి సైతం!!!

తొలి అడుగులు వేసేప్పుడు తన అడుగులే నాకాదర్శం....
నా ప్రతి అడుగు తీరం చేరాలన్నదే తన ఆరాటం!!!

ఆకలి నిండిన కడుపును నే చూడకూడదన్నది తన ఉద్దేశ్యం...
ఎరుగనైతి, నా ఆకలికై తను అనుభవించు కష్టాల సందేశం!!!

ఓటమెదురైన ప్రతి సారీ నన్నాదరించినదా హస్తం...
వెన్ను తట్టి ప్రోత్సహించి చేసిందీ, విజయపు దిశానిర్దేశం!!!

నే దారి తప్పినప్పుడే, తడి రుచి చూసే తొలిసారి ఆ నయనం....
మరువలేనూ, నా మార్గం మార్చేందుకు తన గమ్యం వదిలేసిన వైనం!!!

ఇరుకైన దోవల్లో నన్నెత్తుకుని కొనసాగించెను తన పయనం....
తడబడు ప్రతి అడుగుకూ బదులిచ్చు తన నైజం, నింపిందీ నాలో ఆత్మవిశ్వాసం!!!

తనకు కొడుకును చేసి, అడగకనే ఇచ్చెను ఆ దైవం నాకీవరం...
జన్మంతా అర్పించినా తీరేనా నన్నీ స్థాయికి చేర్చిన తండ్రి రుణం!!!

లోకం ఎరిగినంతలో తండ్రి హృదయం పాషాణం....
లోకులు ఎరుగరైతిరో ఎమో సమస్త నదుల జన్మ స్థానం!!!

పది మాసాలే మోయు కడుపున బిడ్డను ఏ తల్లైనా...
ఆ కొద్ది సేపే అనుభవించు తల్లి, ఎంతటి పురిటి కష్టమైన!!!
ఎదిగేంత వరకూ మోసేను తండ్రి తన భుజముల పైన...
భరించు ఎదురుదెబ్బలు తన గుండె మాటున, ఎదిగే ప్రతి సందర్భం లోనా!!!

Wednesday, August 19, 2009

కష్టాల్, నష్టాల్,.......

కష్టాల్, నష్టాల్, వుంటాయ్....ఈ బతుకు బండి కుదుపులలో...
కోపాల్, తాపాల్, కలుగుతయ్ .... అనుకున్నవి జరగని సమయాలలో...
బాధల్,భయాల్, కమ్ముతాయ్.... ఓటములే ఎదురౌతున్న వేళల్లో...
నిరాశల్, నిస్పృహల్, చేరుతాయ్.... ఒంటరిగా మిగిలిపొయిన సందర్భంలో...

పైవే నిత్యం, సత్యం లా కనిపిస్తయ్....
కన్నీటిని ధారలుగా మార్చేస్తయ్...
పక్క వాని పై నిప్పులు కురిపిస్తయ్...
చీకటిలోనే వుండిపోతామనిపిస్తయ్...
అర్థంలేని బ్రతుకుని ఇలా యెన్నేళ్ళో గడిపేస్తయ్...
నవ్వేందుకు అందులో ఆస్కారమే లేదనిపిస్తయ్...!!!

పువ్వు రాలిన కొమ్మలనలేదు ఇదే శాస్వతమని...
మసకబారిన సూర్యుడనలేదు ఇంతే తన బ్రతుకని...
రాహువు మింగినా చంద్రుడొప్పలేదు ఇక తను లేనని..
ఒడ్డు కాదన్నా అలలాపేనా సముద్రంతో తమ పోరుని...
ఏదీ కలిసి రాకున్నా ఆపవచ్చునా ఈ జీవన ధారనీ... !!!

Tuesday, August 18, 2009

నా మది లో గల ఈ భావాలు

నా మది లో గల ఈ భావాలు... పంచుకోవాలనుకున్నా.....తన తో కలిసి చేసిన ప్రయణం లో....చెప్పేందుకు అప్పుడు ధైర్యం లేదు....దాన్ని తలచుకునేందుకు ఇప్పుడు తీరిక లేదు!!!


నీ పలుకుల పల్లవి నింగిని చేరగ...
తొలకరి జల్లై నువు నేలకు జారగ...
ప్రకృతి కాంత పులకింతల్లో మొగ్గలు వేసే...
నీ...నా చెలిమి సంకేతంగా!!!
పచ్చని వెన్నెల నిండుగ కాచే...
మన ఆనందాలే ఆమని కాగా!!!

నిత్యం రగిలే రవి నేనైనా...
దారే తెలియని...నిశి లో చేరి...శశి గా మారి...
నీ ముంగిట వాలి...
దినముకు కరుగుతూ....క్షణములో పెరుగుతూ!!!

తెగబడు అడుగులు....... పాదములాపగ!!!
తడబడు మాటలు....పెదవులు దాటక!!!
ఎగబడు ఆత్రం......... గుండెను తాకగ!!!
భాషను మరిచీ భావం....మూగైపోగా.....

నా ఎదలో వ్యధలు నీతో పంచే పథమేది..?
నీ మది లో కథలు నాకే తెలిసే విధమేది...?

Monday, August 10, 2009

వదిలేయకు...నిస్పృహకు...


ఆశయ శిఖరారోహణ లో తడబాటు సహజం...
తడిమి చూసుకో అప్పుడు నీ యెద లోతుల్లోని స్వప్నం....
కనబడలేదా అక్కడ వేళ్ళూనిన లక్ష్యపు వృక్షం...
కస్టాన్నే ప్రేమిస్తే కన్నీరైనా కాదా కలల సాధన కు మార్గం....

Saturday, August 1, 2009

సంకల్పం....

గురువు లేని బోయ కి...గురి నేర్పింది ఎవ్వరు...
గగనగంగను ఇల దించిన భగీరథుని బలమెవ్వరు..
సుధ సాధన లో సురల పక్షాన ధైర్యమెవ్వరు...
కడ దాకా సాగే కఠోర శ్రమకి సారథెవ్వరు !!!

కలవారందరు నీకు లేని వారౌతున్నా..
కల్లో కూడ రాని వారౌతున్నా...
కల్లోలం చుట్టుముడుతున్నా...
కాంతి రేఖ కనబడకున్నా...
కడలి అడుగున నీ కోరిక సమాధి అవుతున్నా.....
కలతలతో కృంగిపోకు నా నేస్తమా... కలల తీరం చేర్చేది....నీ సంకల్పమే సుమా...!!!