Friday, October 10, 2008

a శునకం శకునం

“‘శకునాల పక్షి బయలుదేరిందిరా’ అని అందరూ రోజూ అంటూంటే నాకు తల తీసేసినట్టుంటుంది, కాని మీకు మాత్రం అసలు చీమ కుట్టినట్టైనా లేదా.........ఖర్మ ఖర్మ ఎం చేద్దాం? హూ! చెబితే వినడు కొడితే ఎడుస్తాడు చాదస్తపు మొగుడు, చాదస్తపు మొగుడని.......ఓయ్! లేవండి బారెడు పొద్దెక్కింది. ఆ శకునాల పని కానిచ్చి ఇహ బయలుదేరండి.నేను చెప్పేది ఏవైనా చెవికెక్కుతోందా!” అని మాయావిడ తిడుతూంటే లేస్తేగాని నాకు ఆ రోజు జరిగినట్టుండదు, అంతే కాదు మనలో మాట మాయావిడ తిట్లతో మొదలైతేనే ఆ రోజు నాకు మంచి జరుగుతుందనేది నా నమ్మకం. అదే నాకు రొజులో మొదటి శుభ శకునం. ఏంటో రోజులో మొదట భార్య మొహం చూస్తే మంచిదంటారు కాని నాకు తెలిసి ఇప్పటివరకు నేను మా ఇన్నేళ్ళ సంసారం లో దాని మొహం ఎప్పుడూ లేవగానే చూడలేదు. ఎందుకు రిస్కు? అనీ నా అరచేతినే చూసుకుంటూ వుంటాను. ఎవడో తలకుమాసిన వెధవ మాయావిడకు ఈ విషయం చెప్పేశాడు.ఇంకెవడైవుంటాడు మా ఆఫీసులోని చంద్రం గాడే అయ్యివుంటాడు. ఈ రొజు ఎట్టి పరిస్థితులలో నా మొహం చూసాకే మీరు నిద్రలేవాలని కండీషన్ పెట్టి చచ్చింది. చూడకపోతే, ఇంకే ఉపద్రవం వచ్చి పడుతుందోనని అలగేనన్నా. ఎమౌతుందో చూడాలి ఈ రోజు. "హలో! నా మొహం చూడాలా వద్దా అనే ఆలొచనలో పడ్డరా ఏంది? లేస్తున్నారా లేక నన్ను రమ్మంటారా....."అని అది గది ముందు చీపుర చెత్తో పట్టుకొని మాయాబజార్ లో ఘటోత్కజుడిలా నిలబడి చూస్తూంటే ఇక తప్పదనుకుని దాని మొహమే చూస్తూ లేచా.

అదేంటో చిన్నప్పట్నుంచి నాకు శకునాల పిచ్చి. ఎలా అలవాటయ్యిందో కూడా తెలియదు, కానీ మా తాతయ్య మళ్ళీ మళ్ళీ శకునాల గురించి చెప్పడం వల్లా, మా నాన్న బయలుదేరేముందు ఈ శకునాలు చూసుకొని బయలుదేరడం వల్లా, అవన్నీ చూస్తూ పెరిగిన నాకు శకునాల మీద అంత నమ్మకం ఎర్పడింది. ఖర్మ ఈ రొజేం జరిగి చస్తుందోనని మాచెడ్డ భయమేస్తోంది లొపల. కానీ.... "నువ్వు ఎదురొచ్చావు కదే ఈ రొజు నాకూ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో" అని నేనంటే అంతకన్నా పెద్ద ప్రమాదమేదో ఇప్పుడే! కొన్ని క్షణాల్లో జరిగిపొతుంది. దాంతో పోలిస్తే ఇంకే ప్రమాదమైనా చిన్నదే. బహుశా ఇందుకనే ఎమో మన పెద్దలు, భార్య మొహం చూస్తే మంచి శకునం అంటారు.సరే, భారం దెవుడి మీద వేసి బయులుదేరాను.

"ఏమయ్యింది నాకూ? " అని చుట్టూ వున్న పరిస్థితిని అర్థం చేసుకునే లోపే మా చంద్రం గాడు నా దగ్గరకు వచ్చి "బాసూ! నువ్వు చాలా అదృష్టవంతుడివి. చావు తప్పి కన్ను లొట్టబొయిందంటే నమ్మూ.. నీకు". వెధవ వ్యాఖ్యానాలు వాడూను అసలు విషయం చెప్పకుండా ఏంటీ ఈ అడ్డుగోలు సామెతలు. చుట్టూ వున్న పరిస్థితి బట్టి నాకు యక్సిడెంట్ అయ్యిందని ఆ తర్వాత హాస్పిటల్ లో చేర్చారని అర్థమయ్యింది. వీడెక్కడ మాయావిడతో మళ్ళీ తన శకునం బాగలెదని నేనన్నానని చెప్తాడోనని, ముందుగానే వాణ్ణి బతిమాలి, బామాలి కాళ్ళు పట్టుకునేంత పని చేసా. "’అసలు ఈ యాక్సిడెంట్ జరిగింది మా ఇంటి దాని వల్ల కాదూ దాని పక్కనే వుండి నాకెదురొచ్చిన ఆ కుక్కది’ ఈ విషయమే చెప్పరా బాబూ మా ఆవిడకి” అని చెప్పి వాణ్ణి పంపేశా. నేను చెప్పింది అబద్దమేమీ కాదు, నిజంగానే ఆ కుక్క ఎదురొచ్చింది. కానీ అసలు విషయం ఇంకోటుంది, అదీ నేను డ్రైవింగ్ చేస్తున్నంత సేపూ మా బాసు గాడి గురించే ఆలోచించా.


అంటే అన్నానని కాదు గానీ, ఆ వెధవ బాసు వల్ల రోజూ చచ్చే చాకిరీ....... ఇది కాదని మళ్ళీ పైన వాడి తిట్ట్లూ , శాపనార్థాలూనూ. ఏ పని చేసినా తృప్తుండదే ఆ దరిద్రుడికి.పైగా నన్ను చూసి నేర్చుకో అంటాడా వాడు, పనంతా మా మీద వేసేసి పెళ్ళంతో కబుర్లాడుకునే ఆ నెలతక్కువ సన్నాసి.వాడి కింద నా బతుకు “అహనా పెళ్ళంట!” సినిమా లో కోట కింద బ్రహ్మానందం లా తయారయ్యింది.కనీసం అలా మనసులో తిట్టుకోడానికి కూడా వీల్లేకుండా "నాకు ఫేస్ రీడింగ్ తెలుసు" అంటాడా!!. ఇంకేం చేస్తాం ఇంట్లోనైనా వాణ్ణి తిడ్దామంటే, మా ఆవిడ “నన్ను తిడ్తూ మీ బాస్ పేరు అడ్డం పెట్టుకుంటారా” అని మళ్ళా.... వాడు ఆపిన తిట్లని ఇది పూర్తి చేస్తుంది.అందుకనే నేను ఇలా రోడ్లో బండి మీద వెళ్ళేటప్పుడు వాణ్ణి తిట్టుకుంటూవుంటాను. నాకు ఇంత దెబ్బ తగిలి ఆసుపత్రిలో వున్నా కూడా నాకు లీవ్ గ్రాంట్ చెయ్యన్నంటాడా ఆ దరిద్రుడు. అదేవిటంటే మార్చి ఆఖరూ.... కుదర్దంటాడా!!!. సరే రెండ్రోజుల్లో ఆఫీస్ కు వాస్తానని చేప్పి పంపించాను.

ఇంతకీ నాకు ఇలా అవ్వటానికి గల కారణం ఆ కుక్క శకునమేనని మా వీధి సిద్దాంతి చెప్పాడు, మాబాగా బడాయికి పొయి నా దగ్గర దక్షిణ తీసుకున్నాడు గానీ, ఆయన ఎదురొస్తే మాత్రం జరిగే పనులేమున్నాయనీ?, అటూ ఇటూగా ఇదేగా జరిగేది. “పెద్ద శాంతి చెయ్యాలీ, గ్రహాల దృష్టి నీ మీద సరిగ్గా లేదూ” అని ఎక్కడ వేలు గుంఝేస్తాడోనని తెగ భయపడ్డా. ఫర్వాలేదు, నూటపదహార్లతో సరిపెట్టి నా అనుమానమే నిజమని చెప్పాడు, మరి శకునమా మజాకా!


అసలు శకునమంటేనే ముందు జరగబొయేదానికి, ముందుగా వచ్చే సంకేతం.దీన్నెవ్వరూ నమ్మరు, మా ఆవిడతో సహా మా ఇంట్లో. కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చేసా, అది మా బాసు గాడ్ని తిట్టుకుంటూండడం వల్ల ఇది జరిగింది కాబట్టీ, దానికీ ‘కుక్క’ శకునం కాబట్టీ, మా బాసు కు ఈ కుక్కే సరైన సంకేతమనీ, ఇంక ఎప్పుడు ఈ కుక్క కనిపించినా దాంట్లో మా బాస్నే చూడాలని.
ఆ విధంగా ఎప్పుడు మా బాస్ పై కోపమొచ్చినా, లేకపోతే మా ఆవిడ తిట్టినా, ఆ కోపాన్నంతా ఈ కుక్క మీద చూపించే వాణ్ణి. దీని ద్వారా నాకు ప్రత్యేకంగా గొప్ప మేలు జరగకపోయినా మనసుకు సంతృప్తి గా వుండేది. కానీ ఒక్కటి! ఆ కుక్క ఎదురొస్తే మాత్రం నాకు ఎదో ఒక ప్రమాదం వచ్చి పడుతుందని నా నమ్మకం. ఇదే విషయం చెబితే మా పక్కింటాయన "అదంతా నీ భ్రమ నువ్వు అలా అనుకోకూ..... పాపం ఆ కుక్కను ఇంక కొట్టకు, ముందా పిచ్చి శకునాలను నమ్మటం మానేయ"మంటాడా! ! అయినా ఆయనకేం తెలుస్తుంది ఈ శకునాల గురించి ఒక్కసారి నమ్మి చూడమని చెప్పండి, ఇహ వదిలిపెట్టడు. నమ్మితేనే కదా దాని గురించీ, ఆ లోతు గురించీ తెలిసేది. అదేదో సినిమా లో అన్నట్టు "నమ్మకమే జీవితం" కదా! ఏం కాదా. ఇదే మాటంటే ముసిముసిగా నవ్వుకుంటూ పోతాడు "వీణ్ణింక మార్చలేం"అని ఫొజు పెట్టుకుంటూ. మా బాస్ పుణ్యమా అని నాక్కూడా ఆ ఫేస్ రీడింగ్ ,బాడి లాంగ్వేజ్ ఏదో అబ్బింది లేండి. దాన్ని ఇలా వుపయోగిస్తూ వుంటాను అప్పుడప్పుడూ.అది సరే మొన్నీమధ్య మా కుక్క నేను పెట్టే తిండికి అతిగా విశ్వాసం చూపించబోయి మా ఇంట్లో దొంగలుపడితే అరుస్తూ.. వాళ్ళ చేతిలో దెబ్బలు తిని చచ్చింది.

నాకిక మా వీధిలో అపశకునం గా వున్న కుక్క చచ్చిందని ఒక వైపూ, నా కోపాన్ని చూపించే మార్గం పొయిందని మరో వైపూ బాధగా వుండి అలా చూస్తూంటే, మాయావిడ "పాపం చాలా మంచి కుక్క ....... ప్చ్! తనని కొట్టి చంపుతున్నా మన డబ్బులు పోకుండా కాపాడి ఆ దొంగల్ని పట్టించింది!" అని నానా విధాలా జాలి కురిపిస్తూంటే, నేనే మధ్యలో ఆపి నా మనసులో మాట చెప్పేసరికి పడగ విప్పిన నాగుబాములా కస్సున నా మీదకు అంతెత్తున లేచీ "మీ దరిద్రపు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదూ" అని చాటలో ఏరుతున్న బియ్యంతో సహా వంటింట్లోకి వెళ్తూ "మరేం బాధ పడకండి! ఆ కుక్క ఒక పిల్లని కందట. పక్కింటి వాళ్ళ దొడ్లో వుందని వాళ్ళు చెప్తే... దాన్నీ మీరేక్కడ కొట్టి చంపేస్తారోనని మీకు చెప్ప లేదు" అని వాక్యం పూర్తి చేసింది.

ఈ రోజు నేను మా సిద్ధంతి తో మాట్లడుతూ అలా బండ్లో ఆఫీసుకి బయలుదేరాను. కాని నాకో అనుమానం ఏంటంతే నాకీ రోజు ఎదురోచ్చింది ఆ కుక్క 'పిల్లే'నని, దీన్ని నివృత్తి చేసుకుందామని దార్లో వెళ్తూ మాయావిడకి ఫోన్ చేసాను. విషయం చెప్పీచెప్పగానే "ముందు చూస్తూ బండి నడపండి, మీకీవాళ ఎదురొచ్చింది ఆ కుక్క పిల్లే వుంటా!" అని పెట్టేసింది.
చచ్చాం రా దేవుడో! ఏం జరుగుతుందో ఇవ్వాళ అని అనుకుంటూ ఆఫీసు లోకి అడుగుపెట్టేనోలేదో మా చంద్రం గాడు ఎగిరి నా మీద పడినంత పనిచేసి "బాసూ! నీకు ప్రమోషన్ వచ్చింది...ట్రాన్స్ఫర్ తో సహా" అని ఒక స్వీట్ నోట్లో పెట్టడు. మా బాస్ కూడా నన్ను తెగ మెచ్చుకుంటూ "నువ్వు చాల కష్టపడే వాడివోయ్ అందుకే నీకు ఇంత త్వరగా ప్రమోషన్ వచ్చింది, ఊరికే అన్నరా మన పెద్దలు ‘కష్టే ఫలీ’ అని" అంటూ పెద్ద పొగడ్తల క్లాసు పీకాడు. రోజూ గాడిదచాకిరి చెయ్యించుకొని ఇప్పుడు ఎన్ని మాటలైనా అంటాడు.

ఈ విషయం గురించి మా సిద్దాంతిని అడిగితే నాకు ఆ కుక్క పిల్ల శకునం బాగ అచ్చొచ్చిందంట ఇంకా అది నా అదౄష్ట లక్ష్మి లాంటిదంట. ఎమొ నిజమే ఇన్నళ్ళూ రాని ప్రమోషన్ అది ఎదురు రాగానే వచ్చిందంతే అదృష్టమేగా మరి.

" ఎవండోయ్! ఎంత సేపూ ఆ కుక్క పిల్లను పట్టుకొని వుంటారా ఏంది? కాస్త నాకు సాయం చెయ్యకూడదూ..... ఈ సామాన్లన్నీ నేనొక్కదాన్నే సర్దుకోలేక చస్తున్నా..."అని ఒకటే మాయావిడ పోరు పెడుతున్నా, నా అసలు బాధ దానికేం అర్థమౌతుంది? కుక్కలు మనిషి బ్రతికినన్ని రోజులు బ్రతకవంటగా పాపం! అంటే ఈ కుక్కపిల్ల నేను వున్నంతకాలం నాతో వుండలేదూ... 'నాయీ' అదృష్టం కొన్నళ్ళేనా!! ఇప్పుడెలా???

No comments: